ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని తన కాలి వేళ్లపై ఆడించిన 'కింగ్ ఆఫ్ పాప్' మైఖేల్ జాక్సన్ జీవితం ఒక అద్భుతం, ఒక విషాదం, ఒక అంతుచిక్కని మిస్టరీ. ఈ దిగ్గజ గాయకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'మైఖేల్ (2026)' . ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఈ రోజు ( ఏప్రిల్ 24, 2026 ) విడుదలైంది. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ, మైఖేల్ వ్యక్తిత్వంలోని లోటుపాట్లను ఎంతవరకు తెరకెక్కించారు.? అభిమానుల అంచనాలను అందుకుందా? అనేది ఇప్పుడు చూద్దాం..
అచ్చుగుద్దినట్లు మైఖేల్ లాగే!
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ మైఖేల్ జాక్సన్ సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్. తన మేనమామ పాత్రలో జాఫర్ పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ ఐకానిక్ మూవ్స్, స్టేజ్ ఎనర్జీని అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే 15 నిమిషాల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక చిన్నప్పటి మైఖేల్ పాత్రలో జూలియానో వాల్డి తన అమాయకత్వంతో, గొంతుతో ఆకట్టుకున్నాడు. ఈ 'మైఖేల్ విడుదలైన తొలి రోజే 18.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
బాల్యం నుండి స్టార్‌డమ్ వరకు
సినిమా చాలా సరళంగా, మైఖేల్ చిన్నతనంలో 'జాక్సన్ 5' బృందంతో మొదలైన ప్రయాణం నుండి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగే వరకు సాగుతుంది. తండ్రి జోసెఫ్ జాక్సన్ (కోల్మన్ డొమింగో) కఠినమైన క్రమశిక్షణ, అతని వేధింపులు, ఆ ఉక్కుపిడికిలి నుండి మైఖేల్ బయటపడి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడనేది ప్రధానంగా చూపించారు.
►ALSO READ | ఆ ముద్దు సీన్ చాలా అసౌకర్యంగా అనిపించింది.. 30 ఏళ్ల నిబంధన బ్రేక్ చేసిన కాజోల్!
ఎవరెవరు ఎలా చేశారంటే?
క్రూరమైన, కఠినమైన మైఖేల్ తండ్రిగా కోల్మన్ డొమింగో నటన సినిమాకు ఒక బరువును తీసుకొచ్చింది. కొడుకులోని ప్రతిభను వ్యాపారంగా చూసే తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. తల్లి కేథరిన్ జాక్సన్ పాత్రలో నియా లాంగ్ ఓదార్పునిచ్చే తల్లిగా కనిపించినప్పటికీ, ఆమె పాత్రకు సరైన డైలాగులు లేకపోవడం కొంత వెలితిగా అనిపిస్తుంది. మైఖేల్ లాయర్ జాన్ బ్రాంకాగా మైల్స్ టెల్లర్ తన పరిధి మేరకు నటించారు.
'డార్క్ సైడ్' దాచేశారా?
మైఖేల్ జాక్సన్ జీవితం అంటే కేవలం పాటలు, డ్యాన్స్ మాత్రమే కాదు.. ఆయన చుట్టూ అల్లుకున్న వివాదాలు, చైల్డ్ అబ్యూజ్ ఆరోపణలు, శారీరక మార్పుల కోసం ఆయన పడిన తపన వంటి ఉన్నాయి. అయితే, ఈ సినిమా మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ పర్యవేక్షణలో రూపొందడం వల్ల, ఆయన జీవితంలోని చీకటి కోణాలను (Dark Side) తాకకుండా కేవలం ఒక పాజిటివ్ ట్రిబ్యూట్‌గా మాత్రమే మిగిలిపోయింది. మనుషుల కంటే తన పెంపుడు జంతువులతో మైఖేల్ గడిపే సమయం, ఆయన ఒంటరితనాన్ని ప్రతిబింబిస్తుంది. లోకం దృష్టిలో సూపర్ స్టార్ అయినప్పటికీ, లోపల ఆయన ఎప్పటికీ ఎదగని ఒక పిల్లాడిగానే మిగిలిపోయారనే కోణాన్ని దర్శకుడు చూపించారు.
నిరాశపరచదు కానీ..
సంగీత పరంగా ఈ సినిమా నిరాశపరచదు కానీ, 'బిలీ జీన్', 'బీట్ ఇట్' వంటి ఐకానిక్ పాటల మేకింగ్ లేదా పూర్తి స్థాయి ప్రదర్శనలు ఆశించిన వారికి కొంత నిరాశ ఎదురుకావచ్చు. సినిమా మైఖేల్ అనే 'మనిషి' పై ఎక్కువ దృష్టి పెట్టింది, మైఖేల్ అనే 'పెర్ఫార్మర్' పై తక్కువ ఫోకస్ పెట్టింది అన్న విమర్శలు వస్తున్నాయి. 'మైఖేల్ 2026' ఒక ఎమోషనల్ రైడ్. వివాదాలను పక్కన పెట్టి, ఒక సామాన్య బాలుడు అసామాన్య శక్తిగా ఎలా ఎదిగాడో చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ మూవీ. మైఖేల్ మేనల్లుడు జాఫర్ రూపంలో మనం మళ్ళీ 'కింగ్ ఆఫ్ పాప్'ను వెండితెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

