భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడవ రోజు కూడా తమ నష్టాల పరంపరను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాయి. శుక్రవారం మార్కెట్లు ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.51 గంటల సమయంలో సెన్సెక్స్ 720 పాయింట్లు, నిఫ్టీ 188 పాయింట్లు కోల్పోయాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 323 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 301 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతున్నాయి.
ప్రధానంగా మార్కెట్లలో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడే ఈ నష్టాలకు కారణం అంటున్నారు నిపుణులు. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో పాటుగా ఐటీ రంగంలో కొనసాగుతున్న మందరగమనం ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు కూడా మన మార్కెట్లలో స్టాక్స్ డంప్ చేస్తూ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం కూడా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తోంది.
ఈ క్రమంలో గ్లోబల్ మార్కెట్ల నుంచి కూడా ప్రతికూల సంకేతాలు రావటం బేర్స్ సైలెంట్ అయ్యేలా చేస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద నిమిషాల్లోనే లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. సమయం గడుస్తున్న కొద్దీ నష్టాలు మరింతగా పెరుగుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

