మళ్లీ తెరపైకి డ్రగ్స్‌‌ కేసు!

మళ్లీ తెరపైకి డ్రగ్స్‌‌ కేసు!

నిందితులకు క్లీన్‌‌ చిట్ ఇచ్చారంటూ ప్రచారం

సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. డ్రగ్స్‌‌ కేసులో విచారించిన వారికి క్లీన్‌‌ చిట్‌‌ లభించిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండు నెలల క్రితం ఫోరం ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌ (ఎఫ్‌‌జీజీ) వివిధ అంశాలవారీగా సమాచారం కోసం ఆబ్కారీ శాఖకు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసింది. ‘గోర్లు, వెంట్రుకలు, ఇతర నమూనాలతో చేసిన పరీక్షల్లో, శాంపిల్స్‌‌లో ఏం తేలింది? కేసు స్టేటస్‌‌ ఎంత వరకు వచ్చింది? డ్రగ్స్‌‌ ఎంత మంది తీసుకున్నారు? కోర్ట్‌‌ ట్రయల్‌‌ స్టార్ట్‌‌ అయ్యిందా లేదా? డగ్స్‌‌ తీసుకున్నవారిని నిందితులుగా గుర్తించారా? బాధితులుగా గుర్తించారా?’ అనే వివరాల కోసం అప్లికేషన్‌‌ పెట్టుకుంది. అయితే ఈ సమాచారం ఇచ్చేందుకు ఆబ్కారీ శాఖ నిరాకరించింది. దీనిపై ఎఫ్‌‌జీజీ తాజాగా ఆర్టీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. డ్రగ్స్‌‌ కేసులో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తు కొనసాగుతోందని డ్రగ్స్‌‌ కేసు సిట్‌‌ హెడ్‌‌ శ్రీనివాస్ తెలిపారు.

కేసు నేపథ్యం ఇదీ..

2017లో సౌతాఫ్రికాకు చెందిన రఫెల్ అలెక్స్‌‌ విక్టర్‌‌ ముంబై నుంచి హైదరాబాద్‌‌కు కొకైన్ తీసుకొచ్చి అమ్ముతున్నాడని అరెస్టు చేశారు. రొన్సన్ జోసెఫ్ అనే వ్యక్తిని కూడా అదే ఏడాది జులైలో అరెస్టు చేశారు. గంజాయి అమ్ముతున్నాడన్న కారణంగా ఎన్డీపీఎస్‌‌(నార్కోటిక్‌‌ డ్రగ్స్‌‌ అండ్‌‌ సైకోట్రోపిక్‌‌ సబ్‌‌స్టేన్సెస్‌‌) యాక్ట్ కింద అతడిపై అభియోగాలు మోపారు. ఎక్సైజ్‌‌ అధికారుల విచారణలో నిందితులు పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలడంతో అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఇద్దరు అధికారులతో స్పెషల్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ టీం(సిట్)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పార్టీల్లో డ్రగ్స్ వాడినట్లు సమాచారం ఉందంటూ 62 మంది సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి వారందరినీ ఎక్సైజ్‌‌ పోలీసులు విచారించారు. వీళ్లలో 12 మంది సినీ ప్రముఖులు కాగా, 50 మంది వీఐపీల పిల్లలు, కార్పొరేట్ స్కూల్స్‌‌ స్టూడెంట్స్ ఉన్నారు. కేసు దర్యాప్తు సందర్భంగా కొందరి గోళ్లు, వెంట్రుకల నమూనాలను, కొందరి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. వాళ్లు డగ్స్‌‌ తీసుకున్నారో లేదో నిర్ధారించుకునేందుకు ల్యాబ్‌‌ టెస్ట్‌‌లకు పంపారు. డ్రగ్స్​కు సంబంధించి మొత్తం 12 కేసులు నమోదవగా, 4 చార్జిషీట్లు దాఖలైనట్లు గతంలో ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. అయితే ఈ చార్జిషీట్లలో సెలబ్రిటీల పేర్లు లేవు.