ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి

ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి

కుర్రోళ్లు అంటే ఎలా ఉండాలి.. పద్దతిగా.. మరొకరికి అండగా.. ఆదర్శంగా ఉండాలి కదా.. ఈ కుర్రోళ్లు ఎలా ఉన్నారో తెలుసా.. అరాచకం.. మరీ అరాచకంగా ఉన్నారు.. రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. రాళ్లతో దాడి చేశారు. అది కూడా రోడ్డు పక్కన ఉండి కాదు.. బైకులపై వెళుతూ.. వెళుతూ ఆర్టీసీ బస్సుపై రాళ్లు విసిరారు. బస్సులో ప్రయాణికులు ఉన్నారన్న సోయి కూడా లేదు.. రాళ్లతో కొడితే అద్దాలు పగులుతాయి.. ప్రయాణికులకు గాయాలు అవుతాయన్న కనీస ఆలోచన కూడా లేదు ఈ కుర్రోళ్లకు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోకు చెందిన బస్సుపై గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. బస్సు అద్దాలపై రాళ్లు వేస్తూ హల్ చల్ సృష్టించారు. బస్సులో ప్రయాణిస్తున్న అందర్ని భయబ్రాంతులకు గురిచేశారు. అదృష్టవశాత్తూ  బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై వీడియో తీసిన బస్సులోని ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యానికి పంపారు. ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్  ఎక్స్ వేదికగా స్పందించారు.  

"హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన బస్సుపై ఇవాళ కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు.

ఆర్టీసీ బస్సుపై దాడిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తునూ ప్రారంభించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని సంరక్షించుకోవాల్సింది కూడా ప్రజలే. ప్రజల ఆస్తిపై దాడులు చేయడం శ్రేయస్కరం కాదు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను వారి నుంచి వసూలు చేయడం జరుగుతుంది" అని సజ్జనార్ ట్వీట్ లో తెలిపారు.