వార్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌తో గ్యాస్‌‌‌‌ కొరత..వానాకాలానికి యూరియా టెన్షన్‌‌‌‌ !

వార్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌తో గ్యాస్‌‌‌‌ కొరత..వానాకాలానికి యూరియా టెన్షన్‌‌‌‌ !
  •    ఏప్రిల్‌‌‌‌, జూన్‌‌‌‌లో బఫర్‌‌‌‌ స్టాక్​ కోసం నెలకు 2  లక్షల టన్నులు..
  •     జులై, ఆగస్టు డిమాండ్‌‌‌‌కు మరో 3 లక్షల టన్నులు అవసరం
  •     జాగ్రత్త పడకపోతే గత వానాకాలం సమస్యలు 
  • రిపీట్ అయ్యే ప్రమాదం

హైదరాబాద్, వెలుగు : వానాకాలం సీజన్‌‌‌‌కు యూరియా సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో ద్రవరూప సహజ వాయువు (ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ) సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో దేశంలోని యూరియా తయారీ ప్లాంట్లు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గత వానాకాలంలో ఎదురైన ఎరువుల కొరత మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వానాకాలం పంటల కోసం రాష్ట్రానికి భారీ స్థాయిలో యూరియా అవసరం ఉండడంతో ప్రభుత్వం ఇప్పటి నుంచే బఫర్‌‌‌‌ స్టాక్స్‌‌‌‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌‌‌‌ నుంచి జూన్‌‌‌‌ వరకు బఫర్‌‌‌‌ స్టాక్స్‌‌‌‌ కోసం నెలకు కనీసం 2 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని, జూలై – ఆగస్టులో పీక్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ సమయంలో అదనంగా మరో మూడు లక్షల టన్నులు అవసరం అవుతాయని అగ్రికల్చర్‌‌‌‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నేచురల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌ కొరతతో తగ్గిన ఉత్పత్తి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో గల్ఫ్‌‌‌‌ ప్రాంతం నుంచి ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారతదేశానికి ప్రధానంగా ఖతార్‌‌‌‌ నుంచి వచ్చే ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ సరఫరా తగ్గడంతో యూరియా పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశంలోని పలు యూరియా ప్లాంట్లు ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్నాయి. గ్యాస్‌‌‌‌ లభ్యత తగ్గడంతో కొన్నిచోట్ల ప్లాంట్లు కేవలం 60 శాతం ఉత్పత్తితోనే నడుస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్‌‌‌‌ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌)లో కూడా గ్యాస్‌‌‌‌ కొరత ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్‌‌‌‌లో ప్రస్తుతం సగటున 3,300 టన్నులే ఉత్పత్తి అవుతోంది. అంటే రోజుకు సుమారు 550 టన్నుల మేర ఉత్పత్తి తగ్గింది. ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌లో తయారయ్యే యూరియాలో 40 నుంచి 45 శాతం వరకు తెలంగాణకే కేటాయిస్తారు. ఇక్కడ ఉత్పత్తి తగ్గితే రాష్ట్ర రైతాంగంపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వానాకాలం పంటలపై ప్రభావం

తెలంగాణలో వానాకాలంలో వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలకు యూరియా అత్యంత కీలకం. సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే పంటల సాగు ఖర్చులు పెరగడంతో పాటు ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్‌‌‌‌ యుద్ధం కారణంగా గత వానాకాలంలో కూడా దిగుమతులు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం గ్యాస్‌‌‌‌ సమస్య ఇలాగే కొనసాగితే గత సీజన్‌‌‌‌ పరిస్థితులే మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

అంతర్జాతీయంగా పెరగనున్న యూరియా ధరలు  

గ్యాస్‌‌‌‌ కొరతతో పాటు ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లో యూరియా ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో టన్నుకు సుమారు 470 డాలర్లు ఉన్న ధర ప్రస్తుతం 600 డాలర్లకు పైగా చేరినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అవసరమైతే ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

యూరియా కేటాయింపులపై కేంద్రానికి రాష్ట్రం వినతి

యూరియా సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి లెటర్​ రాశారు. వానాకాలం డిమాండ్‌‌‌‌కు ముందు ఏప్రిల్‌‌‌‌– జూన్‌‌‌‌ నెలల్లో ప్రతి నెలా 2 లక్షల టన్నుల యూరియా బఫర్‌‌‌‌ స్టాక్‌‌‌‌  కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బఫర్‌‌‌‌ స్టాక్స్‌‌‌‌ ఏర్పాటు, దిగుమతులు పెంపు, యూరియా పరిశ్రమలకు గ్యాస్‌‌‌‌ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటేనే వానాకాలం సీజన్‌‌‌‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయొచ్చని గుర్తు చేశారు.