హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర అంత్యక్రియలు శనివారం ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించిన పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు ఘన నివాళులర్పించారు. అంతిమ యాత్రలో డీజీపీ శివధర్ రెడ్డి సహా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అంతిమ గౌరవం సమర్పిస్తూ దొర పాడెను రాష్ట్ర శివధర్ రెడ్డితో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ మోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహాప్రస్థానం వద్ద అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి, జితేందర్, ఐపీఎస్ అధికారులు రాజీవ్ త్రివేది, ఎస్ చంద్రశేఖర్ రెడ్డి , ఐఎస్‌డబ్యూ ఓఎస్డీ కమలాసన్ రెడ్డి తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.
