- విదేశాల నుంచి నిలిచిన అమోనియం నైట్రేట్
- వార్షిక బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం
కోల్‌బెల్ట్, వెలుగు: అమెరికా, ఇరాన్ యుద్ధం సింగరేణి సంస్థను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 2025-– 26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 13 నాటికి 67.78 మిలియన్‌టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉండగా 81.23 శాతంతో 55 మిలియన్ టన్నులు మాత్రమే సాధించింది. లక్ష్యం చేరడానికి మరో 17 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది.
వార్షిక సంవత్సరం మరో 18 రోజులతో ముగియనుంది. రోజుకు 2.80 లక్షల టన్నులకు కేవలం 1.70లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధిస్తుంది. కనీసం 70 మిలియన్ టన్నులను చేరుకోవాలని ఆపసోపాలు పడుతున్న సంస్థకు తాజా యుద్ధం తీవ్ర విఘాతం కలిగిస్తోంది. బొగ్గు ఉత్పత్తికి డీజిల్, పేలుడు పదార్థాల కొరతతో సింగరేణి సతమతమవుతోంది.
తగ్గిన పేలుడు పదార్థాల సరఫరా
సింగరేణి సంస్థ అండర్ గ్రౌండ్ మైన్స్‌లో బొగ్గు వెలికితీసేందుకు, ఓసీపీల్లో మట్టి (ఓవర్‌బర్డెన్), బొగ్గును వెలికితీసేందుకు ఎక్స్ఫ్లోజివ్స్పై ఆధారపడుతోంది. ఏటా 3 లక్షల టన్నుల పేలుడు పదార్థాల అవసరముంటోంది. సాధారణంగా సమ్మర్ లోఇతర ప్రాంతాల నుంచి ఎక్స్ఫ్లోజివ్స్ సప్లయ్‌లో కొరత ఉంటుంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి రోజుకు 800 టన్నుల సైట్ మిక్స్డ్ ఎముల్షన్ (ఎస్ఎంఈ) అవసరమవుతుంది. ఎస్ఎంఈ ఉత్పత్తిలో కీలకమైన అమోనియం నైట్రేట్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఆమెరికా- ఇరాన్ యుద్ధంతో ఓడల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. దీంతో సింగరేణికి ఎస్ఎంఈ సప్లై చేసే కాంట్రాక్ట్ సంస్థలు గడిచిన వారం రోజులుగా సప్లైని తగ్గించాయి. రోజుకు సగటున 400 టన్నుల ఎస్ఎంఈ కూడా ఓసీపీలకు అందడంలేదు. భవిష్యత్‌లో డిమాండ్‌కు తగినంత ఎస్ఎంఈ సరఫరా కష్టమని చెబుతున్నాయి. పేలుడు పదార్థాల కొరత వల్ల మట్టి వెలికితీత (ఓవర్‌బర్డెన్), బొగ్గు బ్లాస్టింగ్ పనులకు ఆటంకం కలుగుతోంది.
ఆందోళన కలిగిస్తున్న డీజిల్ కొరత
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత కోసం పెద్ద ఎత్తున ఇంధన వనరులను వినియోగిస్తోంది. ఓసీపీల్లో షావల్, డంపర్లు, డోజర్లు వంటి భారీ వాహనాలు, ఇతర యంత్రాల కోసం రోజుకు 10 లక్షల లీటర్లకు పైగా డీజిల్ వినియోగిస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఇంధన సరఫరా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఓసీపీలో మట్టి వెలికితీత పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ కంపెనీలకు డీజిల్ సప్లై చేయలేమని నాలుగు రోజుల కిందట హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, రిలయన్స్ సంస్థలు తేల్చి చెప్పాయి. దీంతో ఓబీ కాంట్రాక్ట్ కంపెనీలు బొగ్గు ఉత్పత్తికి అవసరమైన డీజిల్ కోసం సింగరేణిని ఆశ్రయిస్తున్నాయి. కొరత ఉన్న నేపథ్యంలో వీటిని సమకూర్చడం సింగరేణికి తలకుమించిన భారంగా మారింది. యుద్ధం కొనసాగితే రానున్న రోజుల్లో పేలుడు పదార్థాలు, డీజిల్, ఇతర ఇంధన వనరుల కొరత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గడిచిన పది రోజులుగా సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఓబీ వెలికితీత, బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ తగ్గుతూ రావడం సింగరేణి యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
