90 రోజుల్లో.. వడ్ల పైసలు కట్టాలి..మిల్లర్లకు సివిల్ సప్లయ్స్డిపార్ట్మెంట్ ఆదేశం

90 రోజుల్లో.. వడ్ల పైసలు కట్టాలి..మిల్లర్లకు సివిల్ సప్లయ్స్డిపార్ట్మెంట్ ఆదేశం
  • సీఎంఆర్​ ఎగ్గొట్టిన మిల్లర్లకు సివిల్ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్ ​ఆదేశం 
  • 19.05 లక్షల టన్నుల వడ్లు బాకీ పడ్డ 401 మిల్లులు 
  • మొత్తం రూ.4,263.08  కోట్లు రావాలి
  • మిల్లుల్లో వడ్లు ఉంటే టన్నుకు రూ.22,368
  • ధాన్యం లేకపోతే టన్నుకు రూ.24,419  
  • ధర నిర్ణయించిన కేబినెట్​ సబ్ ​కమిటీ 
  • ఇప్పటికే 30 మిల్లుల బకాయిలు వసూలు​
  • చెల్లించేందుకు సిద్ధమవుతున్న 250 మందికి పైగా మిల్లర్లు

హైదరాబాద్/జనగామ, వెలుగు:ధాన్యం మొండి బాకీల వసూలుకు సివిల్​సప్లయ్స్​ ​డిపార్ట్​మెంట్ రంగంలోకి దిగింది. వడ్లు తీసుకుని కస్టమ్ మిల్లింగ్​రైస్(సీఎంఆర్) ఎగ్గొట్టిన మిల్లర్ల నుంచి పాత బకాయిలను వసూలు చేసేందుకు కేబినెట్ సబ్​కమిటీ నిర్ణయం మేరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 90 రోజుల్లో వడ్ల పైసలు చెల్లించాలని మిల్లర్లను ఆదేశించింది. ఇప్పటికే 30 మంది తమ బాకీలు చెల్లించారు. దీంతో వారికి ఫ్రెష్​గా యాసంగిలో ధాన్యం కేటాయించడంతో ఆన్‌‌‌‌లైన్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్ మేనేజ్‌‌‌‌మెంట్ సిస్టమ్(ఓపీఎంఎస్)లోకి  రీ ఎంట్రీ ఇచ్చారు. మరో 250 మందికి పైగా మిల్లర్లు బకాయిలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 401 మిల్లుల నుంచి 19.05 లక్షల టన్నుల వడ్లు డిపార్ట్​మెంట్​కు రావాల్సి ఉంది. కేబినెట్​సబ్​కమిటీ నిర్ణయం మేరకు మిల్లర్ల వద్ద వడ్లు ఉంటే టన్నుకు రూ.22,368, వడ్లు  లేకుంటే రూ.24,419  చొప్పున చెల్లించాలని ఆదేశించారు. ఇన్నాళ్లూ సర్కారు ధాన్యాన్ని తెగనమ్మి కోట్లు కొల్లగొట్టిన మిల్లర్లకు ఈ సీజన్​లో ధాన్యం కేటాయించకుండా ఒత్తిడి పెంచారు.

38.01 లక్షల టన్నులు కేటాయింపు

రాష్ట్రంలోని 1,983 రైస్​మిల్లులకు 2022-–23 యాసంగి సీజన్​లో క్వింటాల్​వడ్లను రూ.2,060 చొప్పున చెల్లించి, రైతుల వద్ద నుంచి సేకరించారు. మొత్తం 38.01 లక్షల టన్నుల వడ్లను మిల్లలకు కేటాయించగా.. వారు సీఎంఆర్​అప్పగించలేదు. దీంతో అప్పటి బీఆర్ఎస్​సర్కారు.. మిల్లుల్లో ఉన్న వడ్ల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. పాల్గొన్న సంస్థలు క్వింటాల్​కు రూ.1,700 చొప్పున కోట్​చేయడంతో వాటిని రద్దు చేసింది. తిరిగి 2024  ఫిబ్రవరిలో కాంగ్రెస్​ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గతంలో టెండర్లలో పాల్గొన్న సంస్థలే క్వింటాల్​కు రూ.2 వేలు కోట్ చేశాయి. ఇందులో హిందుస్థాన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్, మంచుకొండ ఆగ్రో టెక్​​ ఒక్కొక్కటి, కేంద్రీయ బండార్‌‌‌‌ 4, నేషనల్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫార్మర్స్‌‌‌‌ ప్రొక్యూర్​మెంట్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ రిటైలింగ్‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా లిమిటెడ్‌‌‌‌ 6 లాట్లు దక్కించుకున్నాయి. 

మిల్లుల్లో ఉన్న వడ్లను 3 నెలల్లో తీసుకొని డబ్బు చెల్లించాలని ప్రభుత్వం ఆ  సంస్థలను ఆదేశించింది. కాగా, అవి రెండేండ్లలో 18.95 లక్షల టన్నుల వడ్లు మాత్రమే తీసుకుని చేతులెత్తేశాయి. మరో 19.05 లక్షల టన్నుల వడ్ల పైసలు మిల్లులు నుంచి సివిల్ సప్లయ్స్​కు అందలేదు. ఈ ఒక్క సీజన్​వడ్లకు సంబంధించి రూ.4,263.08 కోట్లు సంస్థకు రావాల్సి ఉంది. దీంతో మిల్లర్ల నుంచే బకాయిలను వసూలు చేయాలని సివిల్ సప్లయ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ సీజన్ కు సంబంధించి మిల్లుల్లో వడ్లు ఉన్నాయా.. లేదా తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది.      

సూర్యాపేట జిల్లా మిల్లర్లే ఎక్కువ

వడ్లు తీసుకుని కస్టమ్​మిల్లింగ్​రైస్​ఎగ్గొట్టిన 250 మిల్లుల్లో 9 జిల్లాలకు చెందిన మిల్లర్లే ఎక్కువగా ఉన్నారు. వీటిలో సూర్యాపేట జిల్లా టాప్​లో ఉంది. ఈ జిల్లాకు చెందిన 11 మంది మిల్లర్లు 2.39 లక్షల టన్నుల వడ్లు ఎగ్గొట్టారు. వనపర్తిలో 66 మంది మిల్లర్లు 2.12 లక్షల టన్నుల వడ్లు బాకీ పడ్డారు. టెండర్ వడ్లు ఎక్కువగా సూర్యాపేట జిల్లా మిల్లర్ల వద్ద ఉండగా.. అతి తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, ములుగు జిల్లాలోని మిల్లర్ల వద్ద ఉన్నాయి. 

టెండర్ వడ్లు ఎక్కువగా ఉన్న జిల్లాలు..

జిల్లా    మిల్లులు    టన్నుల్లో 
సూర్యాపేట    11    2,39,603
వనపర్తి    66    2,12,256
నిజామాబాద్​    97    1,70,964
నిర్మల్​    12    1,31,879
నల్గొండ    4    1,12,542
మెదక్​    24    1,11,830
నాగర్​కర్నూల్​    19    1,11,396
కరీంనగర్​    11    93,965
జగిత్యాల    6    93,872