న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌ల్లో సోమవారం వర్చువల్ మోడ్ లో కేసుల విచారణ సాఫీగా కొనసాగింది. కేసుల విచారణలో సుప్రీంకోర్టు అనుసరిస్తున్న ఈ విధానాన్నే హైకోర్టుల్లోనూ అమలు చేయాలని, వీడియో కాన్ఫరెన్స్ (వర్చువల్) ద్వారానే కేసులను విచారించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. వర్చువల్‌గా కేసుల విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ముందుకు ఓ ఆర్బిట్రేషన్ వివాదానికి సంబంధించిన కేసు విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ విచారణ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌ల్లో ఆన్‌లైన్ విచారణలు ఎంతో సాఫీగా, అద్భుతంగా సాగాయన్నారు. ఈ చొరవ తీసుకున్నందుకు సీజేఐకి అభినందనలు తెలిపారు. వర్చువల్ విచారణ సౌకర్యవంతంగా ఉందని, ఈ నిర్ణయంతో ఏకీభవిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత వరకు ఆన్‌లైన్ విధానంలోనే కేసుల విచారణ జరపాలని నిర్ణయించామన్నారు. ఈ విషయంపై గత శుక్రవారమే అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో ఫోన్ లో మాట్లాడినట్లు చెప్పారు.
