- ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా ఉద్యమాలు కొనసాగిస్తాం
న్యూఢిల్లీ, వెలుగు: విద్య, వైద్య రంగాల్లో జరిగే అన్యాయాలపై తమ పోరాటం కొనసాగుతుందని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. అన్యాయం జరిగిన ప్రతిచోట ప్రజల పక్షాన నిలుస్తామని చెప్పారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీజేపీ ప్రతినిధులు విజయ్ మల్లంగి, రుచిత్ ఆశా కమల్, అశోక్‌తో పాటు హెచ్‌సీయూ విద్యార్థి పవన్, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రసాద్, కాకతీయ యూనివర్సిటీకి చెందిన యశ్ మాట్లాడారు. తెలంగాణలో హెచ్‌సీయూ భూములు, కేబీఆర్ పార్కు పరిరక్షణ కోసం పోరాడినట్లే, ఇకపై కూడా విద్య, వైద్య రంగాల్లో ప్రజల సమస్యలపై ఉద్యమిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తోందని ఆరోపించారు.
దేశంలో ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తూ ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వేలాది పాఠశాలల్లో విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కూడా లేవని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం ఆందోళనకరమని చెప్పారు. మియాపూర్‌లో నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని, సీజేపీ మాత్రమే అండగా నిలిచిందన్నారు. తాము ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వాల తప్పులను ప్రశ్నిస్తూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
