కలెక్టర్ల ఆధ్వర్యంలో క్లస్టర్ల వారీగా మిల్లుల కేటాయింపు

కలెక్టర్ల ఆధ్వర్యంలో క్లస్టర్ల వారీగా మిల్లుల కేటాయింపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : వడ్లు మిల్లింగ్ వేగవంతం చేసేందుకు సివిల్‌‌‌‌ సప్లైస్​ ప్రత్యేక దృష్టి సారించింది. రైస్‌‌‌‌ మిల్లుల్లో పేరుకుపోయిన వడ్ల నిల్వలను వెంటనే మిల్లింగ్‌‌‌‌ చేసేలా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నది. మిల్లింగ్​ వేగంగా పూర్తి చేసి ఎఫ్‌‌‌‌సీఐకి కస్టమ్‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌ రైస్‌‌‌‌ (సీఎంఆర్‌‌‌‌) అప్పగించేందుకు  జిల్లాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.  ఇటీవల మంత్రులు, సీఎస్‌‌‌‌ సోమేశ్​ కుమార్ సమావేశమై మిల్లింగ్ ప్రక్రియపై సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు. సివిల్‌‌‌‌ సప్లైస్​ కమిషనర్‌‌‌‌, కలెక్టర్ల నేతృత్వంలో రెవెన్యూ, మార్కెటింగ్, సివిల్‌‌‌‌ సప్లైస్​ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లాల్లోని మిల్లులను బట్టి  క్లస్టర్లుగా విభజించి, ఆయా క్లస్టర్ల పరిధిలోని ఒక్కో మిల్లుకు  తహసీల్దార్, ఆర్డీవో, డీటీలు, సివిల్‌‌‌‌ సప్లైస్​ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌లను నియమించారు. ఆర్డీవోలు, సివిల్‌‌‌‌ సప్లైస్​ మేనేజర్లు జిల్లా స్థాయి అధికారులుగా వ్యవహరిస్తారు. ప్రతీ రోజు మిల్లింగ్ పై నివేదికను కలెక్టర్లకు అందిస్తారు.

20 రోజుల్లో 3లక్షల టన్నులు మిల్లింగ్‌‌‌‌

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో 91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. లాస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ 4.86 లక్షల టన్నుల యాసంగి వడ్లు.. ఈ నెలాఖరులోగా మిల్లింగ్ పూర్తి చేసి ఎఫ్‌‌‌‌సీఐకి 3 లక్షల టన్నుల రైస్​ ఇవ్వాల్సి ఉంది. గడువు 20 రోజులే ఉండడంతో జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టారు. బాయిల్డ్ రైస్ మిల్లుల్లోనే ఫోర్టిఫైడ్ రైస్ మిల్లింగ్ చేయాల్సి ఉంది.  బాయిల్డ్ రైస్ మిల్లులు అధికంగా ఉన్న పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో అధికారులు ఫోర్టిఫైడ్ రైస్ మిల్లింగ్ వేగవంతం చేస్తున్నారు. గత వానకాలం 35.70 లక్షల టన్నుల ధాన్యాన్ని రా రైస్‌‌‌‌  మిల్లింగ్ చేయాల్సి ఉంది. నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం పరిధిలోని మిల్లుల్లో రా రైస్‌‌‌‌ మిలింగ్ కోసం అధికార యంత్రాంగం పని చేస్తున్నది.