ఏండ్లు గడుస్తున్నా నెరవేరని సీఎం కేసీఆర్  హామీ 

ఏండ్లు గడుస్తున్నా నెరవేరని సీఎం కేసీఆర్  హామీ 
  •     ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి.. పర్మనెంట్ చేస్తమన్నరు 
  •     ప్రైవేట్’ యూనిట్ల ఏర్పాటుకే సర్కారు మొగ్గు  
  •     పర్మనెంట్ కోసం 4,156 మంది ఎదురుచూపులు


హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళల ఆర్థిక అభివృద్ధి, ఎంపవర్ మెంట్ కోసం పని చేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగుల సర్వీస్ ను రెగ్యులరైజ్ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ ఏండ్లు అవుతున్నా  నెరవేరలేదు. మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభిస్తామని.. సెర్ప్ ఉద్యోగుల జాబ్ ను పర్మనెంట్ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ జాబ్ పర్మనెంట్ సంగతి పక్కనపెట్టి.. నెలనెలా టైంకు జీతం వస్తే చాలు అని ఉద్యోగులు అనుకునే పరిస్థితిని సర్కార్ తీసుకొచ్చింది. ఇప్పటికే.. లోన్ రికవరీలో లేట్ అయినా, తమ పరిధిలో ఏవైనా డ్వాక్రా గ్రూపులు డబ్బులు చెల్లించకపోయినా ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సర్కారు దడ పుట్టిస్తోంది. దీంతో రెగ్యులరైజేషన్ డిమాండ్ తో పోరాటం చేసేందుకూ సెర్ప్ ఉద్యోగులు భయపడే పరిస్థితులు వచ్చాయి.  

తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండబోరని ఉద్యమ సమయంలో కేసీఆర్ అనేకసార్లు ప్రకటించారు. కానీ రాష్ట్రం వచ్చాక ఈ విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టారు. రెండోసారి ఎన్నికలకు వెళ్లేటప్పుడు 2018లో ప్రకటించిన టీఆర్ఎస్ మేనిఫెస్టో(11వ పేజీ, 16వ పాయింట్)లో మాత్రం సెర్ప్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019 జనవరి 19న అసెంబ్లీలో గవర్నర్ ఇచ్చిన స్పీచ్ లోనూ సెర్ప్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి ప్రస్తావించారు. దీంతో తమ జాబ్ లు పర్మనెంట్ అయినట్లేనని సెర్ప్ ఉద్యోగులు అనుకున్నారు. కానీ మూడేండ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఈ హామీకి అతీగతీ లేదు. మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టిస్తామన్న ప్రభుత్వం.. ప్రైవేట్ వ్యక్తులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు భూసేకరణ షురూ చేసింది. ఇందుకోసం ఇప్పటికే అప్లికేషన్లు కూడా తీసుకుంది.  

వైఎస్ హామీ ఇచ్చినా.. వీలుకాలే  

ఉమ్మడి ఏపీలో 2000లో ‘వెలుగు’ పేరిట తొలిసారిగా డ్వాక్రా గ్రూపులు ఆరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలై ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరించాయి. 2004లో కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి రాగానే ఈ స్కీమ్ పేరును ‘ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ)’గా మార్చారు. 2014లో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చాక దీనిని ‘గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)’గా మార్చారు. ప్రాజెక్టు ప్రారంభమైన 2002 నుంచి గత 20 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నవారు సహా ప్రస్తుతం 4,156 మంది ఉద్యోగులు అన్ని స్థాయిల్లో కాంట్రాక్టు పద్ధతిలోనే పని చేస్తున్నారు. 2009 ఎలక్షన్ సందర్భంగా వీరిని రెగ్యులరైజ్ చేస్తామని అప్పటి సీఎం వైఎస్ హామీ ఇచ్చారు. కానీ కొన్నినెలలకే ఆయన మరణించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, ఎలక్షన్ టైంలోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అప్పటినుంచి సెర్ప్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే రిటైర్?   

సెర్ప్ ఉద్యోగులు రెగ్యులరైజ్ కాకపోయినా.. కొంతమేరకు జీతాలు మాత్రం పెరిగాయి. అయితే, పొరుగున ఉన్న ఏపీతో పోలిస్తే మాత్రం జీతాలు కూడా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు తక్కువే ఉన్నాయి. ఇన్నేండ్లయినా పర్మనెంట్ చేయకపోవడంతో తాము రిటైర్ అయ్యే వరకూ కాంట్రాక్టు ఉద్యోగులుగానే కొనసాగాల్సి వచ్చేలా ఉందని రిటైర్మైంట్ కు దగ్గర్లో ఉన్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్పందించి ఈ బడ్జెట్ లోనైనా నిధులు కేటాయించి తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు.