కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు.. కేంద్రమంత్రి బండి సంజయ్కి సీఎం రేవంత్ రెడ్డి సూచన

కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు.. కేంద్రమంత్రి బండి సంజయ్కి సీఎం రేవంత్ రెడ్డి సూచన
  • సమాజంలో గౌరవం పెరగాలంటే ధైర్యంగా 
  • విచారణను ఎదుర్కోవాలని హితవు
  • తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు 
  • బాధితురాలికి 100 శాతం న్యాయం చేస్తాం
  • రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీనే పీఎం అభ్యర్థి 
  • కుల గణన, రైతు పాలసీలతో ప్రజల ముందుకు వస్తం 
  • 2034 దాకా నేనే తెలంగాణ సీఎం 
  •  ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాహుల్
  • ​అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తానని కామెంట్

హైదరాబాద్​, వెలుగు:కేంద్ర మంత్రి బండి సంజయ్​ తక్షణమే తన కుమారుడిని స్వయంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌‌‌‌లో అప్పగించాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఆరోపణలు ఎదుర్కొంటూ చట్టం నుంచి పారిపోవడం తీవ్రమైన తప్పిదమని, ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ ఇందుకు నైతిక బాధ్యత వహించాలన్నారు.  జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో శుక్రవారం ‘వే టు న్యూస్ కాన్ క్లేవ్ 2026’ లో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడారు. 

"నేను ఈ వేదిక నుంచి బండి సంజయ్​కి ఒక స్నేహపూర్వక సూచన చేస్తున్నా.. తక్షణమే మీ అబ్బాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌‌‌‌లో అప్పగించండి. అలా చేస్తే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నిజాయితీ కలిగిన అధికారులతో దర్యాప్తు చేయిస్తున్నాం ధైర్యంగా విచారణను ఎదుర్కోమనండి" అని సీఎం పేర్కొన్నారు. కింది స్థాయి కార్యకర్త నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చిన బండి సంజయ్‌‌‌‌కు.. సొంత కుమారుడి తప్పిదాల వల్ల సమాజంలో తలవంపులు వచ్చాయనేది పచ్చి నిజమన్నారు. చట్టపరంగా బాధితురాలి వయసు, ఇతర కీలక ఆధారాలను ధ్రువీకరించుకున్న తర్వాతే తాము నిందితులకు నోటీసులు ఇచ్చామని, స్పందించడానికి తగిన సమయం కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. 

ఆ గడువు లోపల స్పందిస్తారని ఆశిస్తున్నామని, ఒకవేళ స్పందించకపోతే పోలీసులు తమదైన శైలిలో వ్యవహరిస్తారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసును రెండు రోజులు వాయిదా వేసుకోవడం వల్ల నిందితులకు వచ్చే లాభం ఏమీ ఉండదని, చట్టం ముందు నిలబడి విచారణను ఎదుర్కొంటేనే కనీస గౌరవమైనా దక్కుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.  రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ వస్తున్న విమర్శలను సీఎం  ఖండించారు. శాంతిభద్రతల పరిరక్షణలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదని, తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై  కేసులో ప్రభుత్వం వెనకడుగు వేసిందన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో అస్సలు నిజం లేదని.. ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే తాము ‘పోక్సో’  కేసు నమోదు చేసి, తమ నిబద్ధతను చాటుకున్నామన్నారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని, బాధిత కుటుంబానికి వంద శాతం న్యాయం చేసే బాధ్యత  సీఎంగా  తనదేనని స్పష్టం చేశారు.

  • గడీల దగ్గర గులాంగిరీ చేస్తున్న ప్రవీణ్ కుమార్.. మాపై బురదజల్లొద్దు

ఘటన జరిగిన సమయంలో ఆ అమ్మాయి మేజరా? మైనరా? అనే విషయంలో రెండు రకాల వాదనలు ఉన్నాయని.. అందుకే స్కూల్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టి ఫికెట్లు, ఆధార్ కార్డులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సీఎం చెప్పారు. విచారణలో చిన్న తప్పు జరిగినా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని, అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నామని తెలిపారు.  బాధితులు ఫిర్యాదు చేయడానికి రెండు గంటల ముందే, తమపై ‘హనీ ట్రాప్’ జరిగిందంటూ బండి సంజయ్ కుమారుడు కూడా కరీంనగర్‌‌లో ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ రెండు పరస్పర ఫిర్యాదులను బేరీజు వేసుకోవడానికి, నిజానిజాలు నిర్ధారించుకోవడానికి పోలీసులకు కనీస సమయం పడుతుందని.. ఎలాంటి ఆధారాలు లేకుండా హడావుడిగా ఇళ్లపై పడితే ‘రాజకీయ కక్షసాధింపు’ అంటూ మళ్లీ ప్రతిపక్షాలే విమర్శలు చేస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఐపీఎస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రవీణ్ కుమార్.. తానేదో ఇన్వెస్టిగేటివ్​ ఆఫీసర్ అనుకుంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో గడీలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయనే, ఇప్పుడు అదే గడీల దగ్గర గులాంగిరీ చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. పోలీసులు బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం లాజిక్ లేదన్నారు. తామే గనుక బెదిరించాలనుకుంటే ఫిర్యాదు వచ్చిన గంటలోనే ఇంతటి తీవ్రమైన పోక్సో సెక్షన్ల కింద కేసు ఎందుకు నమోదు చేస్తామని ప్రశ్నించారు. కేటీఆర్, ప్రవీణ్ కుమార్‌‌లకు బండి సంజయ్‌‌తో ఉన్న రాజకీయ పంచాయితీలను ప్రభుత్వంపై రుద్దవద్దని హితవు పలికారు. 

  • సీఎం పిలుపు వస్తే ఆఫీసర్లు వణికిపోవాల్సిందే 

తాను రోజుకు 18 గంటల పాటు నిరంతరం జరిపే సమీక్షల వల్లే ప్రభుత్వ పాలనపై, అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన లభిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. "గతంలో మూడు నెలలకోసారి మూడు గంటలు మాట్లాడి వెళ్లే పాలన ఉండేదని.. ఇప్పుడు సీఎం పిలుస్తున్నారంటే  మొత్తం తిరగేసి చదివి రావాల్సి వస్తోందని అధికారులే చెబుతున్నారు" అని సీఎం పేర్కొన్నారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ‘అన్న’ అని పిలిచే చనువు, గాంధీ కుటుంబంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. 

దేశం పట్ల గాంధీ కుటుంబానికి ఉన్న విశ్వసనీయతను గుర్తించి, వారికి అనుకూలంగా, నమ్మకంగా పనిచేసే వారిని వారు తమ సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఆదరిస్తారని చెప్పారు. తాను 2017లోనే కాంగ్రెస్‌‌లో చేరినప్పటికీ.. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో తనకు ఒక పరిమితి లోపల పూర్తి కంఫర్ట్ ఉందన్నారు.  తెలంగాణలో జరిగే ఒక చిన్న స్థానిక సంఘటన లేదా కేసు ఫైల్ అయినా సరే.. రాహుల్ గాంధీ స్పందించి "రేవంత్.. అక్కడ ఏదో కేసు అయిందంట, నువ్వు ఒకసారి దాన్ని స్వయంగా చూడకూడదా?" అని నేరుగా టెక్స్ట్ మెసేజ్ పంపి అడ్వైస్ చేసేంత బలమైన కమ్యూనికేషన్ తమ మధ్య ఉందని స్పష్టం చేశారు.  

  • దొంగచాటుగా పార్టీలు మారలేదు.. 

ఎప్పుడూ అబద్ధం చెప్పకపోవడం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటమే తన బలమని, రాజకీయాల్లో తాను ఎవరితో పనిచేసినా 100 శాతం నమ్మకంగా నిలబడతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2007లో తాను టీడీపీలో చేరి, పదేళ్ల తర్వాత 2017లో బయటకు వచ్చే రోజు కూడా దొంగచాటుగా రాలేదన్నారు. "నేను పార్టీ వీడే రోజున విజయవాడ వెళ్లి చంద్రబాబు నాయుడిని ప్రత్యక్షంగా కలిశాను. మీ వల్ల, పార్టీ వల్ల నాకు అన్ని ప్రయోజనాలు జరిగాయి కానీ.. నేను అనుకుంటున్న పర్పస్, ప్రజలు కోరుకుంటున్న లక్ష్యం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ప్రత్యామ్నాయంగా వెళ్తున్నానని ముఖం మీదే చెప్పి వచ్చాను" అని వివరించారు. అందుకే పార్టీలు మారినా తాము ఎప్పుడూ సంబంధాలను చెడ గొట్టుకోలేదని.. ఈ రోజుకూ చంద్రబాబు తనకు ఎదురుపడితే ఆయన కళ్లలో తన పట్ల కచ్చితమైన ప్రేమ, గౌరవమే కనిపిస్తాయని రేవంత్ పేర్కొన్నారు.

  • రాహుల్ పీఎం కావడం ఖాయం!

రాహుల్ గాంధీకి దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక గోల్ ఉంది తప్ప, తాను పీఎం కావాలనే కోరిక ఆయనకు లేదని సీఎం వెల్లడించారు. కానీ వికారాబాద్‌‌లో జరిగిన చింతన్ శిబిర్ జిల్లా అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో తానే స్వయంగా రాహుల్ గాంధీతో లోపల సుదీర్ఘంగా చర్చించి, ఒప్పించానని సీఎం తెలిపారు. ప్రస్తుత జనరేషన్ రాజకీయాలను ఆయన 'స్విగ్గీ పాలిటిక్స్' తో పోల్చారు. ఇప్పుడు జనాలు ఉదయం ఆర్డర్ ఇస్తే రాత్రికి వచ్చే పద్ధతిలో లేరని, వితిన్ మినిట్స్‌‌లో డెలివరీ కావాలని కోరుకుంటున్నారని.. ఇలాంటి స్విగ్గీ పాలిటిక్స్‌‌లో లీడర్ నేరుగా ప్రజల ముందు నిలబడి తన కమిట్మెంట్ ఏంటో చెప్తేనే వింటారన్నారు. 

రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని, మొదట కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి ప్రకటించాక.. ఇండియా కూటమిలోని మిత్రులందరినీ తాను కూర్చోబెట్టి కన్విన్స్ చేస్తానని సీఎం చెప్పారు.  ఎన్నికలకు ఏడాది ముందే అధికారికంగా రాహుల్ గాంధీని పీఎం అభ్యర్థిగా నిలబెట్టి.. ఆయన దేశానికి ప్రధానమంత్రి అయితే రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం ఏం చేస్తారు? పరిశ్రమలు, కుల గణన  సహా సామాజిక అంశాలపై ఏం చేయబోతున్నారనే దానిపై ఒక పక్కా 'పాలసీ డాక్యుమెంట్'ను ప్రజల ముందు ఉంచి స్పష్టమైన తీర్పు కోరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

గతంలో 2006–-07 ప్రాంతంలోనే తాను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు 'తెలంగాణ వస్తే నేనే సీఎం అవుతా' అని జర్నలిస్టు మిత్రులతో అన్నానని, అప్పుడు నమ్మని వాళ్లు ఇప్పుడు చూస్తున్నారని.. రాహుల్ గాంధీ పీఎం కావడం కూడా అంతే ఖాయమన్నారు. 2034 దాకా తానే తెలంగాణ సీఎం అన్న రేవంత్​ రెడ్డి ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని, రాహుల్​ తనకు ఏ బాధ్యతను అప్పగిస్తే అది నిర్వహిస్తానని చెప్పారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుల నిర్మూలన అని పైకి చెబు తూ, కులాల వారీగా స్కూళ్లను కట్టి అంటరానితనాన్ని ప్రోత్సహించిందని.. ఈ వివక్షను తుడిచేందుకే తాము ‘యంగ్ ఇండియా స్కూల్స్’ తీసుకొస్తున్నామని, ఇక్కడ అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకుంటారని చెప్పారు. 

  • నా డిమాండ్ తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం

దేశంలో రేవంత్ రెడ్డికి డిమాండ్ ఉందంటే అది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని, కేంద్ర ప్రభుత్వంతో తాము జరిపే చర్చలన్నీ పారదర్శకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం హోదాలో తాను మైకుల ముందే మాట్లాడుకున్నామని, అందులో ఎలాంటి రహస్యాలు లేవన్నారు.  తాను ఎల్లప్పుడూ రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని, నాడు సోనియా గాంధీ గనుక లేకపోయి ఉంటే వెయ్యేళ్లయినా తెలంగాణ వచ్చేది కాదన్నారు.   

  • ప్రతి 15 రోజుల కోసారి జిల్లాల పర్యటన..

రాష్ట్రంలో అస్తవ్యస్తమైన వ్యవస్థలను మళ్లీ పట్టాలెక్కించా ల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే నిధుల సమీకరణపై ఎక్కువ సమయం కేటాయిస్తూ, ప్రతి 15 రోజుల కోసారి జిల్లాల్లో పర్యటిస్తున్నానని సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నిజమైన నాయకులకే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నామన్నారు.

  •  భవిష్యత్ తరాల కోసమే తిట్లనూ భరిస్తున్నా

హైడ్రా కూల్చివేతలపై సీఎం మాట్లాడుతూ ‘యుద్ధం జరిగినప్పుడు కొంతమంది అమాయకులు చనిపోతారని యుద్ధాన్ని ఆపలేం.. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఆక్రమణలపై సంస్కరణల యుద్ధమే’ అని వ్యాఖ్యానించా రు. నగరంలో రోడ్లు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ప్రకృతి క్షమిస్తుందేమో కానీ.. నదులు, చెరువులు, నాలాలను కబ్జా చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుందని, దానికి విలయతాండవమే సమాధానం అవుతుందని హెచ్చరించారు.  

ఈ ప్రక్షాళన  తానేదో సొంత ఇల్లు కట్టుకోవడానికి చేయడం లేదని, భవిష్యత్ తరాల కోసమే తిట్లనైనా భరిస్తూ మొండిగా ముందుకు వెళ్తున్నానని చెప్పారు. నదుల ఆక్రమణల తొలగింపులో పేదలు ఇబ్బంది పడుతుంటే తనకు కూడా బాధగా ఉంటుందని, కానీ వారిని మురికికూపాల్లో వదిలేయలేనని సీఎం అన్నారు.   ఆ ఏరియాలోనే  ప్రభుత్వం డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లు ఇస్తుందని, వారి పిల్లలకు స్కూళ్లు, హాస్పిటళ్లు కట్టించి, ఆర్థిక సహాయం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా అందిస్తామన్నారు.    

  • నిందితులు ఎంతటి వారైనా శిక్ష ఖాయం 

ఈ కేసులో బాధితులు పేర్కొన్న సంఘటనలు ఇప్పుడు జరిగినవి కావని సీఎం పేర్కొన్నారు. నాలుగైదు నెలల క్రితం జరిగిన విషయాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. అప్పట్లో ఎవరెవరు ఎక్కడ కలిశారు? అనే వివరాలను సేకరిం చడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని, టెలిఫోన్ టవర్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో వారి నాయకులే మహిళలపై బ్రూట ల్ దాడులకు పాల్పడిన చరిత్ర ఉందని దుయ్యబ ట్టారు. సినిమా స్టార్లు అయినా,  ప్రజా ప్రతినిధుల పిల్లలైనా సరే.. డ్రగ్స్ కేసుల్లో తాము ఎలా కఠినంగా వ్యవహరించామో అందరూ చూశారని.. ఈ కేసులోనూ నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడడం ఖాయమన్నారు.