- సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
- ‘క్యాన్సర్ అట్లాస్’ అందజేసిన డాక్టర్ నోరి దత్తాత్రేయ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో క్యాన్సర్ ను అంతమొందించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోందని సీఎంరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రసిద్ధ క్యాన్సర్ వైద్య నిపుణులు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ శనివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎంను కలిసి, తాము రూపొందించిన ‘క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ’ అంశంపై సమగ్ర నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నోరి దత్తాత్రేయని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
క్యాన్సర్‌పై పోరాటంలో ఈ అట్లాస్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని, రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, దానికి గల కారణాలను అన్వేషించేందుకు దిక్సూచిలా పనిచేస్తుందని సీఎం పేర్కొన్నారు. నివేదికలోని డేటా ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్న జిల్లాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. క్యాన్సర్ వైద్య సేవలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, రోగుల సంఖ్య ఎక్కువుండే ప్రాంతాల్లో ప్రత్యేక ఆస్పత్రులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా, ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సను మరింత సమర్థవంతంగా, జాప్యం లేకుండా అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో క్యాన్సర్ రహిత వాతావరణాన్ని సృష్టించేందుకు అంతర్జాతీయ నిపుణుల సలహాలతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు.
