- సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్న
- కిషన్‌రెడ్డి, బండి సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్
- మేం లేఖ రాసి ఆరు నెలలు గడుస్తున్నా.. కేంద్రం ఎందుకు
- పట్టించుకుంటలే?.. ఆ ఫైల్‌ను ఎక్కడ తొక్కిపెట్టిన్రు?
- ఫార్ములా– ఈ కేసులో ఐఏఎస్ అధికారి ఎంక్వైరీకి ఎందుకు అనుమతిస్తలే?
- కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి ఇస్తం
- విద్యుత్ కొనుగోళ్లు, కొడంగల్‌లో బీజేపీ నేత సూసైడ్ కేసునూ అప్పజెప్తం
- కూలిన కాళేశ్వరాన్ని బీఆర్‌ఎస్ నేతలు నా ఖాతాలో వేయాలనుకున్నారు
- నేనెవరితో పోల్చుకోను.. కేసీఆర్, మోదీలాగా వ్యవహరించను
- సామాన్యుడిని.. నిపుణుల సలహా ప్రకారమే ముందుకెళ్తున్నా
- సింగరేణి టెండర్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలే
- 2018లో తెచ్చిన నిబంధనల మేరకే టెండర్లు..
- ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి 6 నెలలు అయిందని, దీనిపై కేంద్రం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ చేపట్టాలని సీబీఐ డెరెక్టర్‌కు లేఖ రాశాం. అదే కాపీని హోం సెక్రటరీకి జత చేశాం. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తామని కిషన్‌రెడ్డి అఫీషియల్‌గా చెప్పారు. ఇంతకాలమైనా కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ” అని నిలదీశారు. రాష్ట్ర లేఖపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కి సీబీఐ రెఫర్ చేస్తుందని, డీవోపీటీ.. పీఎంవోకు సూచిస్తుందని, మరి ఆ ఫైల్ పీఎంవోలో ఆగిందా? లేదా మరెక్కడైనా ఆగిందా? అనేది కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. అలాగే, ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఐఏఎస్ అధికారిని విచారించేందుకు డీవోపీటీ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి గురువారం తన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఏ1 గా ఉన్న మాజీ ఎస్ఐబీ అధికారి ప్రభాకర్ రావును భారత్‌కు తీసుకు వచ్చేందుకు కేంద్రం సహకరించలేదని ఆరోపించారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం 20 నెలలు కొట్లాడి.. ప్రభాకర్‌రావును తీసుకువచ్చి విచారణ కొనసాగిస్తున్నదని తెలిపారు.
కొడంగల్‌లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ.. ఒక కౌన్సిలర్ స్థానం కోసం మనిషి చంపే ఆలోచన కాంగ్రెస్ పార్టీది కాదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేవలం సింపతీ, సెంటిమెంట్ కోసం బీజేపీ ఈ ఆత్మ హత్యను వాడుకుంటున్నదని సీఎం రేవంత్ అన్నారు. కిషన్ రెడ్డికి లోకల్ పోలీసులపై నమ్మకం లేకపోతే.. విద్యుత్ కొనుగోళ్లతోపాటు ఫోన్ ట్యాపింగ్, ఈ సూసైడ్ కేసును కూడా సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.
ఎన్డీఎస్‌ఏ చెప్పినట్టే నడుచుకుంటున్నం..
కాళేశ్వరం విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కేఆర్ సురేశ్ రెడ్డి మాదిరిగా తాను అపర మేధా విని కాదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే ఈ ప్రాజెక్టు 3 నెలలకే కుప్పకూలిందన్నారు. ‘‘నేను సామాన్యుడిని. నిపుణుల సలహాలు తీసుకుంటున్నా. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచించిన విధంగా కాళేశ్వరం డ్యామేజీ విశ్లేషణను నేషనల్ ఏజెన్సీకి అప్పగించా. ఈ విషయంలో సాంకేతిక నిపుణులు ఒకటి చెప్తే.. బీఆర్ఎస్ నేతలు మరోటి అంటున్నారు. వాళ్లు ఆరోపించినట్లు బాం బులు పెడితే విస్ఫోటనం జరగాలి కానీ.. పిల్లర్లు కుంగుతాయా? కుంగిన మేడిగడ్డ కాళేశ్వరానికి గుండెకాయ. ఆ కుంగిన బ్యారేజీలో నీళ్లు నింపేలా ఒత్తిడి చేసి.. ఆ కూలిన కాళేశ్వరం ప్రాజెక్టును నా ఖాతాలో వేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్సే కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చిందని చెప్పాలనుకుంటున్నరు. వాళ్ల శాపనార్థాలు, కోరికల ప్రకారం నేను నడుచుకోను’’ అని అన్నారు. కవిత కొత్త పార్టీ గురించి చెప్పేందుకు ఏమీ లేదన్నారు. ప్రజలు ఏమైనా ఆలోచించినప్పుడు చెప్తానని తెలిపారు. వాస్తవానికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఒక్కటే అని వ్యాఖ్యానించారు.
వాళ్లను జైలుకు పంపేందుకే అధికారుల నియామకం..
కాళేశ్వరం, ఈ ఫార్ములా, ఇతర కేసుల్లో కేసీఆర్‌ను కేంద్రం అరెస్ట్ చేయడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు చేసిన వాళ్లను (కేసీఆర్, కేటీఆర్, ఇతరులు) జైలుకు పంపేందుకే తాము సిట్ పేరుతో అధికారులను నియమించినట్లు చెప్పారు. ఎస్ఐబీ ఆఫీసులో కనిపించకుండా పోయిన వస్తువులతో పంజాగుట్టలో దాఖలైన మిస్సింగ్ కేసు.. ఫైనల్‌గా ఫోన్ ట్యాపింగ్‌గా మారిందన్నారు. సైజ్ ఆఫ్ క్రైంను బట్టి అధికారులను నియమిస్తారని చెప్పారు. ఈ కేసు ఫైల్ అయిన ఏరియాకు సజ్జనార్ కమిషనర్ కాబట్టి.. సిట్‌కు అధికారిగా ఉన్నారన్నారు. ‘‘ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా పర్యవేక్షిస్తున్నది. సిట్ వేయాలని చెబితే ప్రభుత్వం వేసింది. పోలీసులు డేటా ఆధారంగా విచారణ చేస్తున్నరు. ఈ కేసు విచారణ గురించి నాకేం తెలియదు. నేను తెలుసుకోవాలనుకోవడం లేదు. అందుకే నాకు అధికారులు బ్రీఫ్ చేయడం లేదు. వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా.. సేకరించిన డేటాను అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు’’ అని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టు ఇందులో తాను గనుక ఇన్వాల్వ్ అయితే ఎవరూ బయట ఉండరని హెచ్చరించారు. అయితే, సీఎం కాబట్టి ఏది జరిగినా తన ఖాతాలోకే వస్తుందన్నారు. కానీ, తాను ‘దుష్ట శిక్షణ..-శిష్ట రక్షణ’ చేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్‌నూ ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఆయనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
బుల్లెట్ ట్రైన్ హబ్‌గా శంషాబాద్
కేంద్ర బడ్జెట్‌పై మరింత పరిశీలన చేయాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తన పోరాటంతో ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్‌కు నంబర్ వచ్చిందని, మూడు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్లు, రక్షణ భూముల బదలాయింపు, వరంగల్, ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టులకు మార్గం సుగుమం అయిందన్నారు. అయితే, మూసీ, మెట్రో విస్తరణకు కేంద్రం మద్దతివ్వలేదని చెప్పారు. ‘‘శంషాబాద్‌ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మార్చాలి. శంషాబాద్‌లో విమానం దిగిన వారు.. ముంబై, బెంగళూరు, చెన్నై, పుణెకు వెళ్లేలా ప్లాన్ చేయాలి” అని అన్నారు.
2029లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
దేశ వ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, అప్పుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం చేపట్టబోయే జన గణనతో అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలలు ఆలస్యం కానున్నాయని చెప్పారు. 2027 ఏప్రిల్‌తో సెన్సస్ పూర్తి కావచ్చని చెప్పారు. ‘‘2028 మే వరకు రీ ఆర్గనైజేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్, అసెంబ్లీ సీట్ల పెంపు, విమెన్ రిజర్వేష న్ల ప్రక్రియ కంప్లీట్ అవుతుంది’’ అని చెప్పారు. అయి తే..ఈ ఐదున్నరేండ్లే కాకుండా, వచ్చే ఐదేండ్ల టర్మ్‌లోనూ తానే సీఎం అని ధీమా వ్యక్తం చేశారు. ఇలా పదిన్న రేండ్లు సీఎంగా తాను రికార్డు సృష్టిస్తానన్నారు. 2027 వరకు రాష్ట్రంలో జిల్లాల మార్పు ఉండబోదన్నారు.
సింగరేణి అంశంపై అసెంబ్లీలో చర్చిస్తం..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు సింగరేణి టెండర్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2018లో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రక్రారమే టెండర్లు నిర్వహించినట్టు చెప్పారు. ‘‘2018–2025 వరకు పాత టెండర్ల మార్గదర్శకాలే అమలవుతున్నాయి. కనీసం అందులో కామా, పుల్‌స్టాప్ కూడా మార్చలేదు”అని వెల్లడించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో టేబుల్ చేసి.. అన్ని ఆధారాలను సభ ముందు పెడతామన్నారు. ఈ విషయంలో వాస్తవాలను అంగీకరించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. ‘‘సింగరేణి ఇప్పటికే అప్పుల్లోనే ఉంది. మేం కొత్తగా ఒక్క రూపాయి అప్పు చేయలేదు. బీఆర్ఎస్ హయాంలోనే జెన్‌కోకు సింగరేణి బొగ్గు సరఫరా చేసింది. ఆ డబ్బులు ఇవ్వలేదు. మరి పదేండ్లు బీఆర్ఎస్ ఉన్నప్పుడు సింగరేణి అప్పులపై కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు? నేను అమాయకుడిని కాబట్టే ఇప్పుడు కిషన్ రెడ్డి నోరు లేస్తున్నది” అని మండిపడ్డారు.
బిర్యానీ తిని.. కుర్భానీ కోసం కొట్లాడుతున్న ఏపీ..
కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటా నీటిని వాడుకునేలా ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు ఆగాలని ఏపీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి వీక్‌గా ఉన్నదని, వీలైతే ఏపీ ఆర్థిక సహకారం అందించాలని చురకలంటించారు. ‘‘గోదావరిలో 966 టీఎంసీల మా వాటా మమ్మల్ని
వాడుకోనివ్వండి. వాస్తవానికి మా ప్రాజెక్టులు పూర్తై.. మా వాటా మేం వాడుకుంటేనే వరద నీళ్ల విషయం తేలింది. మా 960 టీఎంసీలకు బ్లాంకెట్‌గా ఎన్‌వోసీ ఇవ్వండి. మా ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, సమ్మక్క–సారక్క, ఇతర వాటికి అభ్యంతరాలు చెప్పకండి. నిజంగా ఏపీ వాదిస్తున్నట్టు వరద జలా లు సముద్రంలోకి వెళ్తున్నట్టయితే.. మీరో 300 టీఎంసీ లు, మాకో 300 టీఎంసీలు పంచుకునేలా సంతకాలు చేసుకుంటే సరిపోతుంది కదా? వాస్తవానికి అసలు సమస్య కృష్ణా వాటర్ పైనే ఉంది” అని వ్యాఖ్యానించారు. నీళ్ల విషయంలో ఏపీ తీరు ‘బిర్యానీ తిని.. కుర్భానీ కోసం కొట్లాడినట్టు” ఉన్నదని ఎద్దేవా చేశారు. తమకేమో సాధారణ రైస్ కూడా లేదని అన్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ ఒక కలర్ ల్యాబ్ లాంటిది..
ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఒక కలర్ ల్యాబ్ లాంటిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో ఎలాంటి డేటా ఉండదని, కేవలం ల్యాబ్‌కు వచ్చే షాంపిల్‌ను తీసుకొని పరీక్షిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఆ డేటాను తిరిగి ఇచ్చేస్తారని వివరించారు. ఎలాంటి ఆధారాలను ఇక్కడ స్టోర్ చేసుకోరని చెప్పారు. అలాగే, ‘ఓటుకు నోటు’ కేసు ఆధారాలను సైతం 2021లోనే కోర్టులో సమర్పించినట్టు చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని కొట్టిపారేశారు. అయితే, ప్రస్తుతం ల్యాబ్‌లో పరిశీలనలో ఉన్న ఆధారాలు మాత్రమే దగ్ధం అయి ఉంటాయని చెప్పారు.
నాకు నేనే రాజు.. నేనే మంత్రి..
‘‘రాజకీయాల్లో అయినా.. వ్యక్తిత్వంలో అయినా.. నేనే రాజు.. నేనే మంత్రిని.. నేనెవరితో పోల్చుకోను” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాను మోదీ, కేసీఆర్‌లాగా వ్యవహరించబోనని, రాజ్యాంగ వ్యవస్థను నమ్మి పనిచేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తులు చేసినట్లు చెప్పారు. అలాగే, తాజా మున్సిపల్ ఎన్నికల తీరు, ఇతర అంశాలపై పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు రిపోర్ట్ అందజేసినట్టు వెల్లడించారు. 10 సార్లు కేంద్ర మంత్రుల్ని కలవడం వల్ల.. కనీసం ఒక్క అంశం అయినా పరిష్కారం అవుతుందన్నారు. ట్రిపుల్ ఆర్ నార్త్‌కు నంబర్, రాష్ట్రానికి మూడు బుల్లెట్ ట్రైన్లు వచ్చాయని చెప్పారు. అలాగే, మామూనూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు అనుమతులు దక్కాయని చెప్పారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ భూసేకరణ పూర్తయిందని, ఆదిలాబాద్‌లో త్వరలోనే భూసేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఏడాది జూన్ 2 నాటికి ఈ 2 ఎయిర్‌పోర్టుల పనులు ప్రారంభించి, రెండేండ్లలో ఎయిర్‌పోర్టులు సేవల్లోకికి వచ్చేలా స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు.
ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి..
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌కు తాను మద్దతు తెలుపుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. హార్వర్డ్ వర్సిటీలో ‘2021 సెంచరీ లీడర్ షిప్ చాలెంజెస్’ కోర్సులో తనతోపాటు 40 దేశాలకు చెందిన 60 మంది ప్రముఖులు కోర్సు పూర్తి చేసినట్టు చెప్పారు. ఈ కోర్సుకు వచ్చిన ప్రముఖుల్ని కలవాలంటే జన్మ సరిపోదన్నారు. తాను సొంత డబ్బులతో ఈ కోర్సు పూర్తి చేశానని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు వినియోగించు కోలేదని స్పష్టం చేశారు. ఈ ఫీజును తన తమ్ముడు కట్టారని చెప్పారు. అలాగే, మిగితా ఖర్చులు తానే భరించుకున్నానని తెలిపారు.
ప్రజల నాడి పట్టుకున్న..
ప్రజలను అర్థం చేసుకుంటే రాష్ట్ర రాజకీయాలు అర్థం చేసుకున్నట్టే. ఈ విషయంలో నేను ప్రజల నాడి పట్టుకున్న. పని చేయడానికి రాజకీయ పార్టీలకు, నేతలకు ప్రజలు కావాల్సిన సమయం ఇస్తరు. ఒకసారి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మరోసారి అవకాశం ఇవ్వరు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించబోతున్నది. మెజార్టీ స్థానాలు మావే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ మున్సిపల్ ఫలితాలే రిపీట్ అవుతయ్.
- సీఎం రేవంత్‌రెడ్డి
