నటసింహం నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న 'NBK111' చిత్ర షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టు పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా బాలకృష్ణ కాలుజారి కిందపడటంతో ఆయన మోకాలికి స్వల్ప గాయం అయినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన చిత్రబృందం వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది
వైద్యులు బాలకృష్ణకు ప్రాథమిక చికిత్స అందించి అవసరమైన స్కానింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రంగా లేదని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో నెలకొన్న ఆందోళనకు కొంతవరకు తెరపడింది. ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణ–మనోజ్ మధ్య తెరకెక్కిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణను పూర్తిగా కొత్త స్టైలిష్ అవతారంలో దర్శకుడు గోపీచంద్ మలినేని చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార సామగ్రి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. అత్యాధునిక యాక్షన్ కొరియోగ్రఫీతో రూపొందుతున్న యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తోంది.
కాకినాడ షెడ్యూల్‌లో కీలక యాక్షన్ ఎపిసోడ్లు చిత్రీకరిస్తుండగా చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. బాలకృష్ణ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, గాయం స్వల్పమేనని సమాచారం రావడంతో ఊరట వ్యక్తం చేస్తున్నారు. విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశముందని, చిత్రీకరణ షెడ్యూల్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకుని పనులను వేగవంతం చేస్తున్నారు.
