సరస్వతీ అంత్య  పుష్కరాలకు రండి..సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, అర్చకులు

సరస్వతీ అంత్య  పుష్కరాలకు రండి..సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, అర్చకులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రాలైన యాదగిరిగుట్ట, కాళేశ్వరం సరికొత్త ధార్మిక వైభవానికి సిద్ధమవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలతోపాటు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ముహూర్తం ఖరారైంది.

ఈ రెండు కార్యక్రమాలకు రావాలని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో గల ఆయన నివాసానికి అర్చకులు, ఉన్నతాధికారులతో కలిసి వెళ్లారు. అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం ఇచ్చి, శంకుస్థాపన, పుష్కరాల ఆహ్వాన పత్రికలను అందజేశారు.

కాళేశ్వర తీరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సురేఖ తెలిపారు. మరోవైపు, ఈ నెల 23న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. దేవస్థాన పరిధిలో నిర్మించతలపెట్టిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి వేద పాఠశాల భవన నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎంను కలిసిన వారిలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయాల ఈవోలు భవాని శంకర్, మహేశ్​ఉన్నారు.