పాలమూరు ప్రాజెక్టు పనులు స్పీడప్‌..మిగిలిపోయిన భూసేకరణను వేగవంతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి 

పాలమూరు ప్రాజెక్టు పనులు స్పీడప్‌..మిగిలిపోయిన భూసేకరణను వేగవంతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి 
  • నిధులు వెంటనే చెల్లిస్తాం..పెండింగ్ బిల్లులు ఇచ్చేందుకూ రెడీ
  • స్థానిక మంత్రులు, అధికారులకే  పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి, పాలమూరు గడ్డను పచ్చగా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం  రేవంత్‌రెడ్డి  ఆదేశించారు. పాలమూరు--–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. భూసేకరణ నిధుల విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చూస్తుందని, జిల్లాలోని ఇతర పెండింగ్ ప్రాజెక్టుల బిల్లులను సైతం క్లియర్ చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాగునీటి రంగంపై కీలక దిశానిర్దేశం చేసిన సీఎం..   జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను స్థానిక మంత్రులు, అధికారులకే అప్పగిస్తూ  నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, సంబంధిత అధికారులు రెగ్యులర్‌గా సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పనులను పరుగులు పెట్టించాలని సూచించారు.

 ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘా రెడ్డి, రాకేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్‌‌, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.