టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ..ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ..ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడేలా తీర్చిదిద్దిన ఘనత రాజీవ్ గాంధీదే  అని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.   దేశ ఐక్యత, సమగ్రత కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అర్పించిన గొప్ప దేశభక్తుడు రాజీవ్ అని కొనియాడారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు  మంత్రులతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొని రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. భారతదేశానికి సాంకేతికతను (Technology) పరిచయం చేసి, దేశానికి హైటెక్ హంగులు అద్దిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. స్థానిక సంస్థల్లో మహిళలకు కోటా కల్పించడం ద్వారా, రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కేలా చేశారని గుర్తుచేశారు.  పేదలకు సంక్షేమ ఫలాలు అందించడంలోనూ, ఇందిరమ్మ స్ఫూర్తితో దేశ ప్రగతికి ఆయన బాటలు వేశారని తెలిపారు.

ALSO READ : మూడు నెలలుగా జీతాలు లేవు: ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం జేఏసీ

తెలంగాణకు, గాంధీ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందన్న రేవంత్ రెడ్డి.. రాజీవ్ గాంధీ సేవలకు గుర్తుగానే ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆ మహనీయుని స్ఫూర్తితోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.