- నేరాలు మారాయి.. పోలీసింగ్ మారాలి
- పోలీసు ఉన్నతాధికారులకు
- సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కల్తీ ఆహారం వల్ల క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, దీనిని అరికట్టేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా సహించే ప్రసక్తే లేదని పోలీసు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ఆలోచనలను పంచుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్న ఆయన.. వ్యవస్థలో అందరూ భాగస్వాములేనని, బాధ్యత దాటేస్తామంటే (గీత దాటితే) ప్రభుత్వం ఎంతమాత్రం అంగీకరించదని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలోని ‘బోధి పెవిలియన్’లో పోలీసు సీనియర్ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎస్ రామకృష్ణారావు, రాష్ట్ర భద్రతా సలహాదారు శివధర్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితోపాటు అదనపు డీజీలు, పోలీస్ కమిషనర్లు, ఐజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నేరాల స్వరూపం మారుతోందని, మారుతున్న నేరాలకు దీటుగా పోలీసింగ్ అప్‌గ్రేడ్ కావాలని సూచించారు. రాబోయే పదేండ్ల కొత్త సవాళ్లకు తగ్గట్టుగా డిపార్ట్‌మెంట్‌ను సన్నద్ధం చేయాలన్నారు.
టెక్నాలజీని వాడుకోవాలి
ఫోరెన్సిక్ (ఎఫ్‌ఎస్‌ఎల్), డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు.. పోలీసింగ్‌లో సాంకేతికతను ముమ్మరంగా వాడాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. డ్రోన్ పోలీసింగ్, సీసీ కెమెరాలను పెంచాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. పోలీ స్ శాఖలోని కాలంచెల్లిన పాత ఆయుధాలను తొలగించాలని, డిపార్ట్‌మెంట్‌లోని వాహనాలన్నింటినీ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)గా మార్చాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని, స్కిల్స్ యూనివర్సిటీలో పోలీసుల కోసం సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టాలని తెలిపారు. పోలీస్ ట్రైనింగ్‌లోనే సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేసే వారి ఎంపిక జరగాలన్నారు. ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల నమోదు కోసం ‘క్యూఆర్ కోడ్’ను అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాలను కలిపి ఒకే యూనిట్‌గా చేయాలని దిశానిర్దేశం చేశారు. విజిలెన్స్ విభాగంలో సాంకేతికతను పెంచాలని, ఆ శాఖకు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. డేటా అనాలసిస్ ఆధారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్‌పైన, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిపైన విజిలెన్స్ డేగకన్ను వేయాలని సూచించారు.
డ్రగ్స్, ఆహార కల్తీని అరికట్టాలి
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డ్రగ్స్, ఆహార కల్తీలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టాలని, డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీలు, సెలబ్రిటీల కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. పోలీసు శాఖలో ఎస్‌ఐ నుంచి నాన్ కేడర్ ఐపీఎస్ వరకు.. ప్రమోషన్ వచ్చిన తర్వాత రెండేండ్లపాటు కచ్చితంగా ఇతర విభాగాల్లో పనిచేసేలా నిబంధనలు తేవాలని, దీనిపై సీఎస్, డీజీపీలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, విలేజ్ పోలీసింగ్, నైట్ పెట్రోలింగ్, సాధారణ పెట్రోలింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. పోలీసు శాఖలో జవాబుదారీతనం పెరగాలని, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు.
క్రైమ్ రివ్యూ మీటింగ్‌లు తప్పనిసరి
ఎస్పీలు నిరంతరం తమ జిల్లాల్లో పర్యటించాలని, ఐజీ స్థాయి అధికారులు వారిని పర్యవేక్షించాలని, క్రైమ్ రివ్యూ మీటింగ్‌లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మెరిట్ ఆధారంగానే అధికా రులకు పోస్టింగ్స్ ఇవ్వాలన్నారు. డిపార్ట్‌మెంట్ బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామని, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపు కోసం కేంద్రంతో సంప్ర దింపులు జరుపుతున్నామని సీఎం వెల్లడించారు. అన్ని విభాగాలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లోపించకూడదని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదాల ముందస్తు నివారణ చర్యలపై ఫైర్ డిపార్ట్‌మెంట్ దృష్టి సారించాలన్నారు. మున్సిపల్ శాఖ, హైడ్రాతో సమన్వయం చేసుకుని జూన్ 15లోగా ఫైర్ సేఫ్టీపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. నగరంలో నాలాల నిర్వహణలో మెట్రో వాటర్ వర్క్స్‌తో.. మ్యాన్‌హోల్స్ నిర్వహణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల మధ్య సమన్వయం ఉండాలన్నా రు. సిటీలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం సీఎం ప్రశ్నించారు. ఫ్లెక్సీలను నియంత్రించాలని, సీపీలు, జీహెచ్‌ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన తేల్చిచెప్పారు.
