హైదరాబాద్: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు మంది మృతి చెందడం.. కొందరికి తీవ్ర గాయాలపాలవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళుతున్న నేపథ్యంలో బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారు.. గాయపడిన వారి వివరాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఏపీ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని సీఎం సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్‌తో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో గురువారం (మార్చి 26) తెల్లవారుజూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. 10 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదానికి గురైన బస్సు నిర్మల్ నుంచి పామూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల హాహాకారాలు, ఆక్రందనలు, మంటలతో ఘటన స్థలం భీతావాహంగా మారింది. మృతుల్లో తెలంగాణ వారు కూడా ఉన్నారు.
