మోదీ స‌‌ర్కార్ వైఫల్యంతోనే నీట్ రద్దు..మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్‌‌: సీఎం రేవంత్ రెడ్డి 

మోదీ స‌‌ర్కార్ వైఫల్యంతోనే నీట్ రద్దు..మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్‌‌: సీఎం రేవంత్ రెడ్డి 
  • కేంద్ర ప్రభుత్వ తీరుతో దేశ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం
  • బీజేపీ పాలిత రాష్ట్రాలే లీక్‌‌లకు ప్రధాన కేంద్రాలుగా మారాయని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: నీట్-యూజీ 2026 రద్దు.. ప్రధాని మోదీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ‌‌ నిర్ణయమ‌‌ని సీఎం రేవంత్ రెడ్డి విమ‌‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏక‌‌ప‌‌క్ష ర‌‌ద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర ప్రభావం ప‌‌డుతుంద‌‌న్నారు. గ‌‌త ప‌‌దేండ్లుగా ప్రధాని మోదీ హ‌‌యాంలో 93 పేప‌‌ర్లు లీక్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 2 కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. పేప‌‌ర్ లీక్ జ‌‌రిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎలాంటి చ‌‌ర్యలు తీసుకోలేదని గురువారం సీఎంఓ రిలీజ్ చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు.

నీట్ రద్దు.. దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు వంటిదేన‌‌న్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత, నిర్లక్ష్యపూరితమైన ఈ నిర్ణయం దేశ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింద‌‌ని మండిపడ్డారు. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌‌లు, ప్రభుత్వ వైఫల్యాలు దేశ యువత‌‌ను తీవ్ర అనిశ్చితి, నిరాశలోకి నెట్టాయ‌‌న్నారు. 2019 నుంచి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయినా, ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేద‌‌ని ఆయన గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ లీక్‌‌లకు ప్రధాన కేంద్రాలుగా మారాయ‌‌ని ఆరోపించారు. 

గుజరాత్ రాష్ట్రంలోనే 14 పేపర్లు లీక్.. 

గుజరాత్ రాష్ట్రంలోనే 14 పేపర్లు లీక్ అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 2014 మే నెలలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో లోపాలు బయటపడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ విడుదల చేసిన ‘ది పేపర్ లీక్ డెకేడ్’శ్వేతపత్రం ప్రకారం, కేంద్ర, రాష్ట్ర పరీక్షల్లో 93 పేపర్ లీక్ ఘటనలు జరిగాయ‌‌ని, దీంతో సుమారు 2 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యార‌‌ని చెప్పారు. 2024లో కేవలం 8 వారాల్లోనే నాలుగు ప్రధాన జాతీయ పరీక్షలు రద్దయ్యాయ‌‌న్నారు.

నీట్-యూజీ (24 లక్షల మంది అభ్యర్థులు), యూజీసీ నెట్‌‌ (9 లక్షలు), సీఎస్‌‌ఐఆర్-నెట్, నీట్- పీజీ ర‌‌ద్దు అయిన‌‌ట్టు గుర్తుచేశారు. 2024లో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష (16 లక్షల మంది మహిళలతో సహా 48 లక్షల మంది అభ్యర్థులు) కూడా కొన్ని రోజుల్లోనే రద్దు అయిందన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ కుంభకోణాల జాబితాలో ఉన్నాయ‌‌ని తెలిపారు. నీట్ ర‌‌ద్దు నేప‌‌థ్యంలో విద్యార్థులు, వారి త‌‌ల్లిదండ్రులు ఆందోళన చెందవ‌‌ద్దని రేవంత్‌‌ భ‌‌రోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి, వారి కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పారు.

వీడీ సతీశన్‌‌కు రేవంత్ కంగ్రాట్స్ 

కేరళ సీఎంగా ఎంపికైన వీడీ సతీశన్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కేరళ ప్రజ‌‌ల‌‌కు దశాబ్దాలుగా సేవచేస్తూ విలువలతో కూడిన‌‌ రాజకీయాలు చేసే సతీశన్‌‌కు ఈ పదవి సముచిత గుర్తింపని గురువారం ఓ ప్రకటనలో రేవంత్ పేర్కొన్నారు. సతీశన్ నాయకత్వంలో కేరళ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, పరస్పర సహకారం వంటి రంగాల్లో కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.