ఇక ప్రభుత్వ ఆర్డర్లన్నీ మహిళా సంఘాలకే! దళారులు, కమీషన్ ఏజెంట్ల నుంచి లాక్కొని ఆడబిడ్డలకే ఇస్తం: సీఎం

ఇక ప్రభుత్వ ఆర్డర్లన్నీ మహిళా సంఘాలకే! దళారులు, కమీషన్ ఏజెంట్ల నుంచి లాక్కొని ఆడబిడ్డలకే ఇస్తం: సీఎం
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆస్తులన్నీ మహిళల పేర్ల మీదే చేస్తం
  • మహిళలతోనే ప్రత్యేక రైతు సమాఖ్యలు
  • పంట మార్పిడిపై అవగాహన కార్యక్రమాలు
  • మహిళా శక్తి వారోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వెల్లడి
  • ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గానికి వస్తా.. 
  • వ్యాపార ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని పిలుపు
  • మహిళా సంఘాల 553 బస్సులను జెండా ఊపి ప్రారంభించిన సీఎం

హైదరాబాద్​, వెలుగు: ఇకపై ప్రభుత్వ ఆర్డర్లన్నింటినీ దళారులు, కమీషన్ ఏజెంట్ల చేతుల్లోంచి లాక్కొని మహిళా సంఘాలకే అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘‘రాబోయే రోజుల్లో నేను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి స్వయంగా వస్తాను. మీరంతా అద్భుతమైన వ్యాపార ప్రణాళికలతో సిద్ధంగా ఉండండి. మీకు కావాల్సిన పెట్టుబడులు ఇవ్వడమే కాదు..  ప్రభుత్వానికి కావాల్సిన వస్తువుల సరఫరా బాధ్యతను కూడా మీ చేతుల్లోనే పెడతాం. తెలంగాణను దోపిడీ చేసేటోళ్లకు ఈ ప్రజాపాలనలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడే నా ఆడబిడ్డలకే మొదటి ప్రాధాన్యత’’ అని సీఎం స్పష్టం చేశారు. 

పాఠశాలల నిర్వహణ, మధ్యాహ్న భోజన సరుకుల సరఫరా, ప్రభుత్వ క్యాంటీన్ల బాధ్యతలను ఇప్పటికే మహిళలకు అప్పగించినట్లు సీఎం గుర్తుచేశారు. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సికింద్రాబాద్‌‌లోని పరేడ్ గ్రౌండ్స్‌‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో  మండల మహిళా సమాఖ్యల(ఎంఎంఎస్) కు కొత్తగా కేటాయించిన 553 ఎలక్ట్రిక్​ బస్సులను పరేడ్‌‌ గ్రౌండ్స్ వద్ద సీఎం  జెండా ఊపి  ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఎస్‌‌హెచ్‌‌జీ, ఎంఎంఎస్‌‌లకు వడ్డీ లేని రుణాలు, ఉచిత ప్రయాణంతో ఆదా చేసిన చెక్కులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆస్తులన్నింటినీ మహిళల పేరిట ఇవ్వడమే తమ ప్రభుత్వ విధానమని సీఎం స్పష్టం చేశారు.

‘‘ఇందిరమ్మ ఇల్లు అయినా, ఇంకే ఆస్తి అయినా ఆడబిడ్డల పేరిటే ఇస్తాం. స్కీమైనా, నగదైనా అది మహిళల గల్లా పెట్టెలోనే ఉండాలి. ఆస్తి ఆడబిడ్డ పేరు మీద ఉంటేనే ఇంట్లో ఆయన కూడా మీరు చెప్పినట్టు వింటాడు. లేకపోతే ఆ నగదును తీసుకుపోయి బెల్ట్ షాపులకు పోసి వస్తాడు’’ అని సీఎం అన్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై ప్రతిపక్షాలు  కుట్రలు చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణిస్తుంటే ఓర్వలేక కొందరు కడుపు నిండా విషం నింపుకొని, ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేయించారని మండిపడ్డారు.

 ‘‘మా అక్కలకు, చెల్లెమ్మలకు నేను ఒక్కటే చెబుతున్నా.. మీ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకోవాలని ఎవరైనా రోడ్డు ఎక్కితే, పొయ్యిలో సలాక కాల్చి వాతలు పెట్టండి. మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినా, మీ స్వయం సహాయక సంఘాలను దెబ్బతీయాలని కుతంత్రాలు పన్నినా.. వెనకడుగు వేయకుండా మీ ఆర్టీసీ బస్సులతో తొక్కించుకుంటూ ముందుకు సాగండి. ఆడబిడ్డలతో పెట్టుకున్నోడు ఈ చరిత్రలో ఎవ్వడూ బాగుపడలేదు’’ అని అన్నారు. వ్యవ సాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని వడ్లు, మక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలే బ్రహ్మాండంగా నడిపాయని అభినందించారు. 

కేవలం ఒకే రకమైన పంటలు కాకుండా కందులు, మినుములు, పెసర్లు వంటి పప్పు ధాన్యాలు, కూరగాయలు, తోటల పెంపకం వైపు రైతులను మళ్లించాలన్నారు. చదువుకున్న ఆడబిడ్డలు రైతు వేదికల వద్దకు వెళ్లి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని, ఇందుకోసం మహిళలతోనే ప్రత్యేక రైతు సమాఖ్యలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వెయ్యి కోట్ల భూమి.. కార్పొరేట్ స్థాయిలో భవనాలు హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ కంపెనీలకు భూములిచ్చిన గత పాలకులు మహిళలను పట్టించుకోలేదన్నారు. కానీ, తమ ప్రభుత్వం హైటెక్ సిటీ పక్కనే మహిళా ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం రూ. 1,000 కోట్ల విలువైన భూమిని కేటాయించి 106 స్టాళ్లను అద్భుతంగా ఏర్పాటు చేసిందని తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా 8,000 గ్రామ మహిళా శక్తి భవనాలను ఒకేసారి ప్రారంభించుకున్నామని, 22 జిల్లాల్లో అమెజాన్ వంటి అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో తల ఎత్తుకుని చర్చలు జరిపేలా కార్పొరేట్ స్థాయి ఆఫీసులను నిర్మిస్తున్నామని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఇప్పటివరకు రూ. 61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ ఇవ్వడమే కాకుండా, సున్నా వడ్డీ కింద బ్యాంకులకు రూ. 2,000 కోట్లు విడుదల చేశామని సీఎం తెలిపారు. మహిళా సంఘాలు 3000 బస్సులు కొనుగోలు చేసినా వాటిని ఆర్టీసీలో తిప్పుతూ కిరాయి చెల్లించేలా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ను ఒప్పించామన్నారు. ఆనాడు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ప్రభుత్వం ఇచ్చిన చీరలను మన ఆడబిడ్డలు ఎన్నడైనా కట్టుకున్నారా? అని సీఎం ప్రశ్నించారు.

 ‘‘పొలాల గట్ల మీద మొక్కజొన్న, కందుల చేలకు పందులు రాకుండా, పిట్టలను బెదిరించడానికి మాత్రమే ఆ చీరలను అడ్డం కట్టారు. కానీ ఈరోజు మన ప్రభుత్వం పంపిణీ చేసిన చిలకపచ్చ రంగు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను మా అక్కలు ఎంతో గర్వంగా, నిండుగా కట్టుకొని వచ్చారు. మా ఆడబిడ్డల కళ్లలో ఈ సంతోషం చూస్తుంటే నాకు కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందంగా ఉంది’’ అని సీఎం స్పష్టం చేశారు.  

  • అంబానీ, అదానీలతో పోటీపడేలా ‘మహిళా శక్తి’

మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని సీఎం వివరించారు. నారాయణపేటలో మహిళా సంఘాలు నడుపుతున్న పెట్రోల్ బంకులు నెలకు రూ. 5 నుంచి 6 లక్షలు సంపాదిస్తూ అంబానీ రిలయన్స్ సంస్థతో పోటీ పడుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ప్రభుత్వ స్థలాలున్నా మహిళలకు పెట్రోల్ బంకులు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. అలాగే, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకే పరిమితమైన సోలార్ విద్యుత్ రంగంలోకి మహిళలను తెస్తూ, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామని, దీనికోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ద్వారా నిధులు విడుదల చేయిస్తున్నామని తెలిపారు. 

  • కోటి మంది ఆడబిడ్డలను కోటిశ్వరులను చేస్తం

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే  ప్రభుత్వ ప్రధాన సంకల్పమని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి స్పష్టం చేశారు. ‘తెలంగాణ పల్లె ప్రగతికి ప్రాణవాయువు లాంటి 553 కొత్త ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి రాష్ట్ర మహిళా లోకానికి అంకి తం చేయడం సంతోషంగా ఉంది. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వివిధ రంగాల్లో మహిళలను భాగస్వాములను చేస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు బాటలు వేస్తున్నాం.

 ఇంతకాలం ‘ఎల్‌‌‌‌ నినో’ ప్రభావం వల్ల వానలు రావని వాతావరణ నిపుణులు చెప్పారు. కానీ, పసుపు కుంకుమలతో, కొబ్బరికాయ కొట్టి మన ఆడబిడ్డలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగానే వాతావరణం మారిపోయింది. నా చెల్లెలు, మంత్రి సీతక్క జెండా ఊపి బస్సులను కదిలించారో లేదో..  వర్షం కురిసింది. మృగశిర కార్తె వేళ వాన దేవుడు కూడా మన స్వయం సహాయక సంఘాల గ్రూపులో సభ్యుడిగా చేరిపోయి ఆశీర్వదించినట్లు అనిపించింది. ఈ వర్షం తెలంగాణ వ్యవసాయానికి, మన ఆడబిడ్డల భవిష్యత్తుకు శుభసూచకం’’ అని  తెలిపారు. 

అన్నీ మహిళలకే: మంత్రి సీతక్క

553 మహిళా సంఘాలకు బస్సుల కేటాయింపు లో కీలక పాత్ర పోషించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌కు మంత్రి సీతక్క ప్రత్యేక కృతజ్ఞ తలు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పిం చడమే కాకుండా మహిళలను బస్సుల యజ మానులుగా నిలబెట్టిన ఘనత ప్రజా ప్రభుత్వాని దేనని ఆమె స్పష్టం చేశారు. మహిళలు వంటిం టికే పరిమితం కావాలనే పాత ఆలోచనలకు స్వస్తి పలుకుతూ అవకాశాల్లో సగభాగం మహిళలకే కల్పిస్తున్నామని తెలిపారు. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మహిళలకు అప్పగిస్తున్నామని చెప్పారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో 40 శాతం నిర్వహణ మహిళా సంఘాల చేతుల్లోనే ఉంద న్నారు. మహిళలు సంతోషంగా ఉంటే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ​కండ్లల్లో నిప్పులు పోసుకొని విమర్శలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు.

  • ఉచిత బస్సు ప్రయాణానికి రూ.10,500 కోట్లు

గత ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాల రూ. 4 వేల కోట్ల సున్నా వడ్డీ పైసలను ఎగగొట్టి మోసం చేసిందని సీఎం విమర్శించారు. ‘‘ఆడబిడ్డల శాపనార్థాల వల్లే గత పాలకులు అధికారం కోల్పోయి ఫామ్‌‌హౌస్‌‌లలో పడుకొని ఏడుస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించామని, ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషన్‌‌కు ప్రభుత్వం రూ.10,500 కోట్లు చెల్లించిందని వెల్లడించారు. 

ఉచిత బస్సు ప్రయాణం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల డ్రాపౌట్స్ తగ్గాయని ఆనందం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు పథకాన్ని అడ్డుకోవాలని చూసిన ప్రతిపక్షాలు తేలు కుట్టిన దొంగల్లా మంచం కింద దాక్కున్నాయని విమర్శించారు.