- స్కీం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఆరోగ్యవంతమైన తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
- మూడేళ్లలో అంగన్‌వాడీలకు సొంత భవనాలు
- నిధుల కొరత లేదు.. అడగకముందే ఆదుకుంటామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాబోయే మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎక్కడా అంగన్‌వాడీలు అద్దె భవనాల్లో నడవడానికి వీల్లేదని, ప్రతి కేంద్రానికి సొంత భవనం నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే కేటాయిస్తుందని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల వల్ల ఎదురవుతున్న అసౌకర్యాలను తొలగించి, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఇప్పటికే టీచర్లకు పని సులభతరం చేసేందుకు స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చామని, టెక్నాలజీని వాడుకుంటూ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లోని పేద బిడ్డలకు ఈ భవనాలు విజ్ఞానాలయాలుగా మారాలని, అంగన్‌వాడీల బలోపేతానికి ప్రభుత్వం ఎంతటి ఖర్చుకైనా వెనకాడదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ‘తొలి ముద్ద’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంగన్వాడీ చిన్నారులకు ఇకనుంచి రెడీ టూ కుక్ ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్) ను బ్రేక్ ఫాస్ట్ గా ప్రభుత్వం అందించనుంది. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ కు మొబైల్ ఫోన్లను సీఎం పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల నుంచి, శిశువు పుట్టిన తర్వాత ఐదేండ్ల వరకు వారి ఆరోగ్యం, విద్యాసంస్కారాల గురించి ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. కేవలం భోజనం పెట్టడం మాత్రమే కాకుండా, పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడమే ఈ పథకం ఉద్దేశమని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు రచించినా, వాటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాల్సింది అంగన్‌వాడీ టీచర్లేనన్నారు. ఈ బృహత్తర బాధ్యతను స్వీకరించాలని, ఒక అన్నగా తాను వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని సీఎం అన్నారు.
పిల్లల్లో మొదటి ఆరేండ్లు అత్యంత కీలకం
పిల్లల జీవితంలో మొదటి ఆరేండ్లు అత్యంత కీలకమైన దశ అని, ఈ సమయంలోనే వారి ఆలోచనా విధానం, మెదడు ఎదుగుదల నిర్ణయించబడతాయని సీఎం వివరించారు. అనేక పరిశోధనల ప్రకారం ఈ వయసులో సరైన పౌష్టికాహారం అందకపోతే భవిష్యత్తులో ఆ పిల్లల తెలివితేటలు, శారీరక సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందుకే పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. వ్యాధులు వచ్చిన తర్వాత వేల కోట్లు ఖర్చు చేయడం కంటే, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అంగన్‌వాడీ టీచర్లు తల్లుల వలె బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి చిన్నారిని తమ సొంత బిడ్డలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్న వయసులోనే పిల్లలకు మంచి అలవాట్లు, సంస్కారం నేర్పడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అంగన్‌వాడీ సిబ్బంది సంక్షేమమే తన ప్రాధాన్యత అని, వారిని తన కుటుంబ సభ్యులుగా భావిస్తానని పేర్కొన్నారు. దేశంలో ఒకప్పుడు సగటు ఆయుర్దాయం 33 ఏళ్లు ఉంటే, నేడు అది 73 ఏళ్లకు పెరగడానికి అంగన్‌వాడీల కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. టీచర్ల సమస్యలను సీతక్క, కొండా సురేఖ వంటి మంత్రులతో చర్చించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అడగకముందే అమ్మ అన్నం పెట్టినట్లుగా, సమస్యలను తన దృష్టికి తీసుకురాకముందే తమ్ముడిలా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.నిధుల కేటాయింపులో అంగన్‌వాడీలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని, ఆర్థిక వెసులుబాటు ఉన్నంత మేర టీచర్ల జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
