- మౌలిక వసతులు కల్పించాకే ఇండస్ట్రీలకు భూమి: సీఎం రేవంత్‌రెడ్డి
- జూన్‌కల్లా ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన
- ఏజెన్సీగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’.. ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులతో సొసైటీ
- పారిశ్రామికవేత్తలకు ఎయిర్‌పోర్టు నుంచే ఎస్కార్ట్ ఆఫీసర్
- ద్వితీయ శ్రేణి నగరాలపై ఐటీ ఫోకస్
- కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్‌ను
- ఫ్యూచర్ సిటీకి వచ్చేలా ప్రధానిని కలుద్దాం
- 1500 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ‘డేటా సిటీ’
- ప్రతిపాదిత ‘బుల్లెట్ ట్రైన్’ ప్రాజెక్టుకు వెంటనే భూసేకరణ షురూ
- 3 నెలల్లో ప్రభుత్వ ఆఫీసులన్నింటికీ టీ- ఫైబర్
- ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వెంట్లు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం
- ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని పరిశ్రమల శాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: భారత్ ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని, డిజైన్లు నెట్ జీరో సిటీ తరహాలోనే ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే సంస్థలకు భూ కేటాయింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ వెంటనే సంబంధిత సంస్థలు పరిశ్రమల నిర్మాణం మొదలుపెట్టేలా కఠిన నిబంధన విధించాలని సూచించారు.
బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో పరిశ్రమల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ నాటికి ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యుత్తమ విధానాల కోసం అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని, వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడొద్దని తేల్చిచెప్పారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్‌ను ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చూడాలని, అవసరమైతే ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేద్దామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ వైస్ చైర్మన్ శశాంక, కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
తమిళనాడు, గుజరాత్
పారిశ్రామిక విధానాలపై స్టడీ
రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆకర్షణీయమైన లోగోతో పాటు అత్యాధునిక వెబ్‌సైట్‌ను తక్షణమే రూపొందించాలని సూచించారు. కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కోసం ఒక ప్రత్యేక కార్యాలయాన్ని సైతం యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు, సేవలు అందేలా వ్యవస్థ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తల సౌకర్యార్థం నూతనంగా ‘ఎస్కార్ట్ ఆఫీసర్’ వ్యవస్థను తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ఎయిర్‌పోర్టులో దిగినప్పటి నుంచి పెట్టుబడిదారులకు సహకారం అందించేందుకు గ్రూప్-–1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించాలన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను అధికారులు లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను మన రాష్ట్రంలోనూ అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పారదర్శకంగా అనుమతులు మంజూరు చేసేలా వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. బహుళజాతి, అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగ విస్తరణ కోసం సుమారు 1500 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ‘డేటా సిటీ’ని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ డేటా సిటీకి ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటినే వినియోగించాలన్నారు.
హైవేల వెంట జీసీసీలు..
టైర్-2 నగరాలకు ఐటీ కంపెనీలు
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ), డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రహదారుల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవ లం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ జీసీసీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టేలా సరికొత్త పాలసీ రూపకల్పన చేయాలన్నారు. టైర్- 2 నగరాలకు ఐటీ కంపెనీలు విస్తరిస్తే స్థానిక యువతకు అక్కడే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బియాండ్ క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ పెద్దగా లేని చోట్ల కూడా డేటా సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీ లించాలని సూచించారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను గుర్తించడంతో పాటు రవాణా వ్యవస్థలను సైతం ముందస్తుగానే అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం వెంటనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. పారిశ్రామిక వాడలకు మెరుగైన కనెక్టివిటీ ఉంటేనే భారీ పెట్టుబడులు వస్తాయని, ఆ దిశగా మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలన్నారు. స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూనే, పర్యావరణహితమైన పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. కాగా, ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరు మీద ప్రభుత్వం ఒక సొసైటీని ఏర్పాటు చేయనుండగా, ఆ ఏజెన్సీలో ఐటీ, పరిశ్రమల శాఖకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కాగా, ఎనర్జీ, ఫైనాన్స్‌లాంటి శాఖల అధికారులు ఇన్వెస్ట్ తెలంగాణలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండనున్నారు.
టెక్నాలజీని వాడుకోవాలి..
ప్రభుత్వ పాలనలో సాంకేతికతను జోడించి, ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రాబోయే3 నెలల్లో కచ్చితంగా టీ-ఫైబర్‌కు అనుసంధానం కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా ప్రభుత్వ శాఖల మధ్య ఫైళ్ల పరిష్కారం వేగవంతం కావడంతోపాటు ప్రజల సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఇప్పటికే టీ-ఫైబర్‌కు మారిన ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించా రు. నూతన పారిశ్రామిక విధానాల రూపక ల్పనలో ఏవైనా ఆటంకాలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని తక్షణమే పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు అత్యధికంగా ఉద్యోగాలు దక్కేలా కచ్చితమైన నిబంధనలు రూపొందించాలన్నారు.
