విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు..హైదరాబాద్‌లోనే ప్రపంచ స్థాయి విద్య

విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు..హైదరాబాద్‌లోనే ప్రపంచ స్థాయి విద్య
  • రాష్ట్రాన్ని గ్లోబల్ ఎడ్యుకేషనల్   పవర్ హౌస్‌గా మారుస్తం
  • మన పిల్లలు లక్షలు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు: సీఎం రేవంత్‌
  • హైదరాబాద్‌లోనే ప్రపంచ స్థాయి విద్య
  • యూనివర్సిటీ ఆఫ్​ లండన్​, నార్త్​ ఈస్టర్న్​ వర్సిటీలు క్యాంపస్‌ల ఏర్పాటుకు ముందుకురావడంపై హర్షం


హైదరాబాద్, వెలుగు:  విద్యా, పరిశోధనారంగాల్లో రాష్ట్రాన్ని అంతర్జాతీయ పవర్‌హౌస్‌గా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ గొప్ప అవకాశాన్ని తెలంగాణ యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’​లో ట్వీట్​ చేశారు. హైదరాబాద్‌ను ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో భాగస్వామ్యం  కుదరడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు అంతర్జాతీయ స్థాయి విద్య, నైపుణ్యాలను అందించే లక్ష్యంతో బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’, అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ‘నార్త్- ఈస్టర్న్ యూనివర్సిటీ’లు హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయబోతున్నాయని వెల్లడించారు. వీటితోపాటు ప్రపంచ నంబర్ వన్ ‘హార్వర్డ్ యూనివర్సిటీ’కి చెందిన పలు విభాగాలు మన రాష్ట్రంలో ఎంపిక చేసిన స్పెషల్ కోర్సులు, ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేసేందుకు ముందుకొచ్చాయని స్పష్టం చేశారు. తెలంగాణ యువతకు విద్య, క్రీడలు, ఆధునిక నైపుణ్యాలను అందించి ప్రపంచస్థాయి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా తయారు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.   

విద్యా రంగంలో సరికొత్త శకం

మన పిల్లలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్లే పనిలేకుండా, హైదరాబాద్‌లోనే ప్రపంచ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విద్యా రంగంలో సరికొత్త శకం మొదలుకానుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన డిగ్రీ కోర్సులు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ఉమ్మడి పరిశోధనలు  చేపట్టడంతోపాటు సరికొత్త ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. వివిధ రంగాల్లో ఇప్పటికే స్థిరపడిన నిపుణులు, ఉద్యోగుల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను కూడా ఈ సంస్థలు అందించనున్నట్టు తెలిపారు.  ప్రపంచ అగ్రశ్రేణి యూనివర్సిటీలతో జరిపిన చర్చలు అత్యంత సానుకూల ఫలితాలను ఇచ్చాయని సీఎం వివరించారు. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ ప్రతినిధులతో నిర్వహించిన కీలక భేటీలు సక్సెస్ అయ్యాయని చెప్పారు. అలాగే, అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)తోపాటు పలు ఐవీ లీగ్, టాప్ అమెరికన్ విద్యాసంస్థలతో జరిపిన చర్చలు కూడా ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు.