చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడు సీఎం, టీవీకే చీఫ్ విజయ్ విమర్శలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నిర్ణయం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ సర్కార్ను విజయ్ టార్గెట్ చేయడం ఇదే తొలిసారి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం (మే 15) నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.3 వరకు పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతుందని కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల ఆరోపణలు నిజం చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం గమనార్హం.
