బషీర్‌బాగ్, వెలుగు: బేగంపేట్ పరిధిలోని సియెట్ మారుతి హిల్స్ కాలనీలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయాలని కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సి.హెచ్. సదానందం, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ మాట్లాడారు.
తుది తీర్పు వచ్చే వరకు తవ్వకాలు, బండ్ నిర్మాణం, ఫెన్సింగ్ పనులు నిలిపివేయాలని కోరారు. హుడా అనుమతులతో తాము ఈ కాలనీని అభివృద్ధి చేశామని, ఎఫ్‌టీఎల్ మ్యాప్‌లో ఈ ప్రాంతాన్ని చెరువు పరిధిలో చూపించడం వల్ల ఇక్కడి 86 ప్లాట్ల యజమానులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఈ ఏడాది జనవరి 5న ఇక్కడ యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించినప్పటికీ, హైడ్రా అధికారులు ఇంకా తవ్వకాలు కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు కాలనీలో ఎలాంటి పనులు చేపట్టవద్దని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
