డిగ్రీ ప్రవేశాల్లో కామర్స్ జోరు: దోస్త్ ఫస్ట్ ఫేజ్లో 56,147 మందికి సీట్లు.. దీంట్లో 65 శాతం మంది అమ్మాయిలే 

డిగ్రీ ప్రవేశాల్లో కామర్స్ జోరు: దోస్త్ ఫస్ట్ ఫేజ్లో 56,147 మందికి సీట్లు.. దీంట్లో 65 శాతం మంది అమ్మాయిలే 
  • 97 శాతం మంది ఇంగ్లిష్ మీడియానికే జై.. 
  • తెలుగులో 1,131 మందే వివరాలు వెల్లడించిన టీజీసీహెచ్​ఈ చైర్మన్ 
  • నేటి నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది.  మొత్తం 56,147 మంది విద్యార్థులకు వివిధ కోర్సుల్లో సీట్లు అలాట్ అయ్యాయి.  గురువారం తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) ఆఫీసులో కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎస్​కే మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తో కలిసి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి వివరాలను వెల్లడించారు. 

దోస్త్  ఫస్ట్ ఫేజ్​కు మొత్తం 84,610 మంది రిజిస్ర్టర్ చేసుకున్నారు. వీరిలో 61,543 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 56,147 మందికి సీట్లు పొందారు. మరో 5396 మంది తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో సీట్లు అలాట్ కాలేదు. అయితే, సీట్లు పొందిన వారిలో ఫస్ట్ ప్రయార్టీ ఆప్షన్ లోనే 36,634 మందికి, సెకండ్ ప్రయర్టీ ఆప్షన్ లో 19,513 మందికి సీట్లు లభించాయి. ఈ అడ్మిషన్లలో అబ్బాయిల కంటే అమ్మాయిలే అత్యధికంగా సీట్లు దక్కించుకుని తమ హవా చాటారు. మొత్తం సీట్లు పొందిన వారిలో 36,302 (65%) మంది అమ్మాయిలు ఉండగా, 19,845 మంది అబ్బాయిలు ఉన్నారు. మొత్తం పది కాలేజీల్లో వందశాతం సీట్లు నిండగా, 79 కాలేజీల్లో ఒక్క విద్యార్థి చేరలేదు. 

కామర్స్ వైపే మొగ్గు..

విద్యార్థులు ఎక్కువగా కామర్స్ వైపే మొగ్గుచూపారు.  మొత్తం 23,214 మంది కామర్స్ విభాగంలో సీట్లు పొందారు. దీనిలో బీకామ్ లోనే 19,015 మంది చేరారు. ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ లో14,394 మంది, లైఫ్ సైన్సెస్ లో 9,815 మంది, ఆర్ట్స్ (బీఏ)లో 6,587 మంది సీట్లు దక్కించుకున్నారు. మీడియం వారీగా చూస్తే.. ఇంగ్లిష్ మీడియం క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. 

సీట్లు పొందిన వారిలో 54,608 మంది (97%)  ఇంగ్లిష్  ఎంచుకోగా, తెలుగు మీడియంలో కేవలం 1,131 మంది మాత్రమే సీట్లు పొందారు. ఉర్దూ మీడియంలో 396 మంది, హిందీ మీడియంలో ఏడుగురు, అరబిక్ మీడియంలో ఐదుగురికి సీట్లు లభించాయి.  సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల15 నుంచి 23 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

విద్యార్థులు తమ లాగిన్ ఐడీ ద్వారా కోర్సును బట్టి రూ.500 లేదా రూ.వెయ్యి చెల్లించి సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హులైన వారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం రిపోర్ట్ చేస్తే సరిపోతుందని అధికారులు స్పష్టం చేశారు. 

నేటి నుంచే రెండో విడత..

తొలి విడతలో సీటు రాని వారు, మెరుగైన కాలేజీ కోరుకునే వారి కోసం రెండో విడత ప్రక్రియ ఈ నెల 15  నుంచే ప్రారంభం కానుంది. ఫేజ్-2 రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి మే 26 వరకు ఉంటాయని, వెబ్ ఆప్షన్లు మే 27 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపు మే 30న  చేస్తారు.