రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఏఎఫ్ఆర్సీకి ఫిర్యాదు

రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఏఎఫ్ఆర్సీకి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు రూల్స్ కు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నాయని రాష్ట్ర మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి ప్రకారం.. నాలుగున్నరేండ్లకే ఫీజులు వసూలు చేయాలని కాళోజీ హెల్త్ వర్సిటీ  సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, పలు కాలేజీలు ఐదేండ్ల ఫీజు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొంటూ తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్​ఆర్సీ) చైర్మన్‌‌‌‌‌‌‌‌ కు అసోసియేషన్ నేతలు బుధవారం  మెమోరాండం సమర్పించారు. 

ముఖ్యంగా, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ లోని చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు వర్సిటీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఫీజు కట్టలేదని విద్యార్థులను క్లాసుల నుంచి బహిష్కరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం హెల్త్ వర్సిటీ వద్ద ధర్నా చేయడంతో అధికారులు స్పందించి సర్క్యులర్ పంపినా యాజమాన్యాల్లో మార్పు రాలేదని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఏఎఫ్​ఆర్సీ చైర్మన్.. సదరు కాలేజీలకు నోటీసులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు అసోషియేషన్ తెలిపింది. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ కుమార్ పొడిశెట్టి, కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రఘు తదితరులు పాల్గొన్నారు.