కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చలో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రియాంక అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చలో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రియాంక అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
  • నెక్లెస్​ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు కదిలిన శ్రేణులు
  • లోక్ భవన్  వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు 
  • తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేసిన నేతలు, కార్యకర్తలు
  • పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్​, మంత్రులు వివేక్, పొంగులేటి, దామోదరతోపాటు పలువురు ఎమ్మెల్యేల అరెస్ట్
  • దేశంలో నియంత పాలన సాగుతోంది: మహేశ్​గౌడ్​
  • ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ: మంత్రి వివేక్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతల అరెస్ట్‌‌‌‌కు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో లోక్ భవన్’ ఉద్రిక్తతకు దారితీసింది. లోక్ భవన్ వద్దకు వెళ్లేం దుకు యత్నించిన పలువురు ముఖ్య నేతలను అరెస్ట్​ చేయడంతోపాటు కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.

బుధవారం హైదరాబాద్‌‌‌‌ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌గౌడ్ నేతృత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు చేతులకు నల్ల బ్యాడ్జీలు ధరించి, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఖైరతాబాద్ వైపు ర్యాలీగా తరలివచ్చారు.

అక్కడి నుంచి లోక్ భవన్ వైపు ర్యాలీ సాగుతుండగా.. ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆగకుండా అటువైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని నాంపల్లి, ఇంకొందరిని పంజాగుట్ట పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు తరలించారు.

అరెస్టయినవారిలో పీసీసీ చీఫ్  మహేశ్  గౌడ్, మంత్రులు వివేక్  వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మందుల సామేల్, వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు కాంగ్రెస్  నేతలు రోహిణ్ రెడ్డి, మెట్టు సాయికుమార్ ఉన్నారు.

అదే సమయంలో కొందరు యువజన కాంగ్రెస్  కార్యకర్తలు, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐ నేతలు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ, వారి నిర్బంధాన్ని లెక్కచేయకుండా లోక్ భవన్ వైపు దూసుకెళ్లి మెయిన్‌‌‌‌ గేట్లను తోసే ప్రయత్నం చేశారు.

దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్  జామ్  ఏర్పడింది. కాంగ్రెస్  నేతలను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్​ చేసి.. సమీప పోలీస్‌‌‌‌ స్టేషన్లకు తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు: మహేశ్‌‌‌‌ గౌడ్​
దేశంలో నియంత పాలన సాగుతోందని పీసీసీ చీఫ్  మహేశ్‌‌‌‌ గౌడ్  పేర్కొన్నారు. నీట్  పేపర్  లీక్‌‌‌‌తో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రధాని నరేంద్ర మోదీ అంధకారం చేశారని విమర్శించారు. వారికి న్యాయం చేయాలని ప్రతిపక్షం నిలదీస్తే.. రాహుల్, ఇతర నేతల గొంతు  నొక్కే ప్రయత్నం చేసిందని కేంద్రంపై ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత రాహుల్, ఇతర నేతలను అరెస్ట్​ చేయడం దారుణమని విమర్శించారు.

పోలీసు రాజ్యం నడిపితే చెల్లదని, విద్యార్థులు, యువకుల పోరాటాలకు మోదీ సర్కారు  తలవంచక తప్పదని హెచ్చరించారు. నీట్  పేపర్  లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  రాజీనామా చేయాలని డిమాండ్  చేశారు. కొంతమంది పెయిడ్  ఆర్టిస్టుల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అయినా దేశ యువత మాత్రం రాహుల్  గాంధీ నాయకత్వానికే మద్దతుగా నిలుస్తున్నదని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్  పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే: మంత్రి వివేక్ 
విద్యార్థులు, యువత సమస్యలపై గళమెత్తుతున్న రాహుల్ గాంధీని అరెస్ట్​ చేయడం.. ప్రజాస్వామ్య విలువలను కాలరాయడ మేనని మంత్రి వివేక్  వెంకటస్వామి ఫైర్​ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలని, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని డిమాండ్  చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు ప్రతిపక్ష నాయకులను అరెస్ట్​ చేయడం కేంద్రం నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ చెప్పారని, ఈ లెక్కన ఇప్పటి వరకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కానీ, ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకుండా యువతను నిరాశపరిచిందని విమర్శిం చారు.

దేశ యువతకు ఉపాధి, భద్రతను కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి, వారి తరఫున మాట్లా డుతున్న నాయకులపై దమన కాండకు దిగడం సరికాదన్నారు. నిరసన తెలుపుతున్న విద్యా ర్థులపై లాఠీచార్జి  చేయడం, కాంగ్రెస్  అగ్రనేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ప్రజాస్వా మ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్  దేశవ్యాప్తంగా తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్  ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.