పెట్రోల్ ధరలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌‌కు లేదు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

పెట్రోల్ ధరలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌‌కు లేదు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన రూ.5 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ల అప్పును మోదీ ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లిస్తోందని తెలిపారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ హయాంలో ధరలు పెంచకుండా ఉండటానికి రూ.5 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లను అమ్మి చేతులెత్తేశారని విమర్శించారు.

ఒకవైపు పాత అప్పులను బీజేపీ రీపే చేస్తుందని, కాంగ్రెస్ మాత్రం ఆయిల్ బాండ్స్ అమ్మి పెట్రోల్ రేట్లు పెంచలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. విదేశాలతో పోలిస్తే మన దేశంలో ధరలు తక్కువగా పెరిగాయని చెప్పారు. కాంగ్రెస్ చేసిన పాపాలన్నింటినీ బీజేపీ కడుగుతోందని ఆరోపించారు. 
దేశం మొత్తంలో తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ధరలు రూ.వంద లోపే ఉండగా,  తెలంగాణలో మాత్రం రూ. 111.88  ఉందని తెలిపారు. యుద్ధాలతో ధరల రేట్లు పెరుగుతాయని ప్రధాని మోదీ ముందుగానే చెప్పారని గుర్తుచేశారు.