కేరళ సీఎంగా వీడీ సతీశన్.. ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన

కేరళ సీఎంగా వీడీ సతీశన్.. ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన
  • సుదీర్ఘ చర్చల తర్వాతే సీఎంను నిర్ణయించాం: 
  • ఏఐసీసీ ఇన్‌‌‌‌చార్జ్ దీపా దాస్ మున్షీ
  • ప్రమాణ స్వీకార తేదీపై త్వరలో స్పష్టత ఇస్తామని వెల్లడి
  • కేరళలో కొత్త శకాన్ని ప్రారంభిస్తం:  వీడీ సతీశన్
  • అధిష్టానం నిర్ణయాన్ని పాటిస్త: కేసీ వేణుగోపాల్

తిరువనంతపురం: కేరళ సీఎం ఎంపికపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం  తెర దించింది. నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ నేత వీడీ సతీశన్ పేరును గురువారం అధికారికంగా ప్రకటించింది. సీఎం పదవికి వీడీ సతీశన్‌‌‌‌తో పాటు కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల పేర్లు బలంగా వినిపించాయి. అయితే, మే 7న తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో సీఎల్పీ(కాంగ్రెస్ శాసనసభా పక్ష ) నేతగా ఎవరిని ఎంపిక చేయాలనే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం అందరి ఆమోదంతో సతీశన్‌‌‌‌ను సీఎల్పీ నేతగా నియమించారు. దీనికి సంబంధించిన వివరాలను కేరళ ఏఐసీసీ ఇన్‌‌‌‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ, సెంట్రల్ అబ్జర్వర్లు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, జైరాం రమేశ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 

దీపా దాస్ మున్షీ మాట్లాడుతూ.. " సీఎం ఎంపికకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించడమే కాకుండా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ పీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాం. అందరి ఆమోదంతోనే సతీశన్‌‌‌‌ పేరును ఖరారు చేశాం. నేను త్వరలోనే కేరళకు వెళ్తాను. ఆ తర్వాత సీఎం ప్రమాణ స్వీకార తేదీని నిర్ణయిస్తాం" అని తెలిపారు. 

ముఖ్యమంత్రి ఎంపికలో జాప్యం జరిగిందన్న విమర్శలను కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అని, అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ లోతైన చర్చలు జరపడం వల్లే సమయం పట్టిందని స్పష్టం చేశారు. బుధవారం రాహుల్ గాంధీ, ఖర్గే మధ్య జరిగిన 40 నిమిషాల భేటీతో ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని పేర్కొన్నారు. 

కేసీ వేణుగోపాల్ భావోద్వేగం

సీఎం పదవిని ఆశించిన కేసీ వేణుగోపాల్.. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. " నేను పార్టీకి విధేయుడైన కార్యకర్తను. నాకు పార్టీయే సర్వస్వం. పార్టీ జెండా కప్పుకునే మరణించాలనుకుంటున్నాను" అని చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.  సతీశన్ ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

  • సీఎం ఎంపికలో ముస్లిం లీగ్ ప్రభావం: బీజేపీ

సతీశన్ నియామకాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఎంపికలో ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ప్రభావం ఉందని, రాబోయే ఐదేండ్లు కేరళలో కాంగ్రెస్ ముసుగులో  లీగ్ పరోక్ష పాలన సాగుతుందని ఆరోపించింది. సోషల్ మీడియాలో మీమ్స్ షేర్ చేస్తూ.. కాంగ్రెస్ నిర్ణయాధికార కేంద్రం ఢిల్లీ నుంచి పాణక్కాడ్ హౌస్‌‌‌‌కు (లీగ్ కేంద్రం) మారిందని ఎద్దేవా చేసింది. కేవలం మిత్రపక్షం ఒత్తిడి వల్లే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేని సతీశన్‌‌‌‌కు పట్టం కట్టారని బీజేపీ విమర్శించింది.

  • హామీలను నెరవేరుస్తం

కేరళ రాజధాని తిరువనంతపురంలో వీడీ సతీశన్ విలేకరులతో మాట్లాడారు. సీఎంగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ హైకమాండ్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది పార్టీ తనపై ఉంచిన గొప్ప బాధ్యతగా అభివర్ణించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని.. కేరళలో కొత్త శకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. వేణుగోపాల్, చెన్నితాల సేవలను కొనియాడుతూ.. భవిష్యత్తులో వారిని కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు.