యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్ పై వేటు పడింది. మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో ప్రశాంత్ పై అధిష్టానం వేటు వేసింది. అతనిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ప్రశాంత్ టీమ్ పై 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మే 17వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కొంతకాలంగా ఎంపీ ఉత్తమ్ తో పాటుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి వంటి కొంతమంది సీనియర్లపై ట్రోలింగ్ నడుస్తోంది. దీనిపై మే 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు ఉత్తమ్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తమ్ ఇంటికి సమీపంలోని ఫ్లాట్ నుంచి ట్రోలింగ్ జరుగుతున్నట్లుగా గుర్తించి...సోమవారం (మే 15న) రాత్రి సోదాలు నిర్వహించారు.
సదరు ఫ్లాట్ యూత్ కాంగ్రెస్ పేరుతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడి నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ ఛార్జ్ ప్రశాంత్ పై వేటు వేసింది. అటు ప్రశాంత్ ని విచారణకు హాజరు కావాల్సిందిగా సైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
