డెహ్రాడూన్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కేసు నమోదు అయ్యింది. ఉత్తరాఖండ్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఓ సభలో పొల్గొన్న తర్వాత సభాప్రాంగంణంలో శుద్దీకరణ పూజలు చేశారంటూ రాహుల్ గాంధీ కుల వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారంటూ అమిత్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా, కావాలనే ఈ ఘటనకు కులం రంగు పులిమి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ గాంధీ మాట్లాడారంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. అమిత్ ఫిర్యాదు మేరకు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు రాహుల్ గాంధీపై నైనిటాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
అసలు వివాదం ఏంటంటే..?
ఆగస్టు 8న ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ 'విజయ శంఖనాద’ సభ నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇందులో పాల్గొని ప్రసంగించారు. సభ తర్వాత శ్రీరామ్ సేన, బీజేపీ నేతలు మైదానంలో 'శుద్ధీకరణ' కార్యక్రమం నిర్వహించారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గంగాజలం చల్లి, హవనం నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. శుద్ధీకరణ కార్యక్రమానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.
ఖర్గే అడుగు పెడితే నేల మైల పడ్డదా: రాహుల్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన మైదానాన్ని 'శుద్ధీకరణ' చేశారని లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దళితుడైనందునే ఖర్గే సభ తర్వాత బీజేపీ, శ్రీరామ్ సేన ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డాయని మండిపడ్డారు. ఇది అంటరానితనానికి మరో రూపమని అన్నారు. అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించినా దళితులపై వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు.
ఈ ఘటన బీజేపీ–ఆర్ఎస్ఎస్ మనస్తత్వాన్ని బయటపెడుతోందని విమర్శించారు. శుద్ధీకరణ చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి దాదాపు 20 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలోని ఇందిరా భవన్ లో రాహుల్ మీడియాతో మాట్లాడారు.
ఖర్గే వంటి సీనియర్ నాయకుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. పాఠశాలలో చదువుతున్న దళిత చిన్నారుల పరిస్థితి ఏమిటని రాహుల్ ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ శుద్ధీకరణ కార్యక్రమాన్ని సమర్థించారని ఆరోపించారు. ఈ చర్యకు మద్దతు ఇచ్చిన అతనిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖర్గేకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై స్పందించి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయించాలని కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే స్వాగతిస్తామని రాహుల్ చెప్పారు. చర్యలు తీసుకోకపోతే మాత్రం కాంగ్రెస్ నుంచి తప్పకుండా రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ వదిలిపెట్టబోదని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు జరిగే వరకు పోరాడతామన్నారు.
కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన నిర్వాహకులు
ఖర్గే పాల్గొన్న తర్వాత రాంలీలా మైదానాన్ని శుద్ధి చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ, శ్రీరామ్ సేన తిప్పికొట్టాయి. ఖర్గే పొల్గొన్న సభలో హిందూ మతానికి వ్యతిరేకంగా, వివాదాస్పద నినాదాలు చేయడం వల్లే తాము మైదానాన్ని శుభ్రం చేశామని వివరణ ఇచ్చారు. ఇందులో ఎలాంటి కుల వివక్ష లేదని స్పష్టం చేశారు. దళిత సామాజిక వర్గాలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఆ పూజలో పాల్గొన్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ఎలాంటి నిజాలు తెలుసుకోకుండా.. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
