న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. అభం శుభం తెలియని మూడేళ్ల బాలుడిపై ప్లే స్కూల్ కేర్ టేకర్ విచక్షణ రహితంగా దాడి చేసింది. పిల్లాడిని కుర్చీకి కట్టేసి శరీరంపై వాతలు వచ్చేలా దాడి చేసింది. దెబ్బలకు భయపడి పిల్లాడు స్కూల్ అంటేనే గజగజ వణికిపోయాడు. సీసీటీవీ దృశ్యాల ద్వారా ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లాడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కర్కోటకురాలైన కేర్ టేకర్‌ను కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ లాయర్ తన మూడేళ్ల కుమారుడిని స్థానికంగా ఉన్న మకూన్స్ ప్లే స్కూల్‌లో జాయిన్ చేశాడు. అయితే, గత కొన్ని రోజులుగా పిల్లాడు స్కూల్‌కు పోవాలంటే భయపడుతున్నాడు. రాత్రి వేళల్లో ఉలిక్కి పడుతున్నాడు. బాలుడికి తీవ్రమైన వాంతులు కావడం.. మొహం, కాళ్లు చేతులపై గాయాలు ఉండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు రెండు చెవుల కర్ణభేరిలు తీవ్రంగా వాచిపోయాయని.. ఇది ఎవరో కొట్టడం వల్లే జరిగిందని నిర్ధారించారు.
తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే, తమకు ఏం తెలియదని స్కూల్ యాజమాన్యం బుకాయించింది. దీంతో సదరు బాలుడి క్లాస్ రూమ్ సీసీ ఫుటేజ్ ఇవ్వాలని పేరెంట్స్ కోరారు. తొలుత సీసీ ఫుటేజీ ఇచ్చేందుకు నిరాకరించిన స్కూల్ మేనేజ్మెంట్.. చివరికి రూ.1500 తీసుకుని వీడియో చూపించారు. ఆగస్టు 16, 17, 18 తేదీల సీసీటీవీ దృశ్యాలను చూడగా తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడిని ఒక క్లాత్‌తో కుర్చీకి గంటల తరబడి కట్టేసి ఉంచారు. మిగతా పిల్లలంతా ఆడుకుంటుంటే, ఈ బాలుడిని మాత్రం కుర్చీకి కట్టేశారు.
ఆ క్లాస్‌రూమ్‌లోని టీచర్, కేర్‌టేకర్ కలిసి బాలుడిని పదే పదే చెంపదెబ్బలు కొట్టడం, చెవులు పట్టుకుని బలంగా లాగడం, తన్నడం వంటి క్రూరమైన చర్యలకు పాల్పడినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై బాలుడి పేరెంట్స్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు వివిధ సెక్షన్ల కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. కేర్ టేకర్, టీచర్, ప్రిన్సిపల్, డైరెక్టర్ నలుగురిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. బాలుడిపై విచక్షణరహితంగా దాడి చేసిన కేర్ టేకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
