హైదరాబాద్: తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మార్టం నివేదికలో నర్సుపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. ఆమెను మాన భంగం చేసినట్లు నిందితుడు సనా ఉల్లా ఖాన్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.
తుక్కుగూడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన నర్స్ (21) హత్య కేసు వివరాలు ఏంటంటే.. బాధిత నర్సు స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆమె గత 8 నెలలుగా తుక్కుగూడలోని ప్రైమ్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆసుపత్రి వర్గాలే సిబ్బంది రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి వెనుక వైపు షెల్టర్ రూమ్స్ (క్వార్టర్స్) కేటాయించాయి. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తన విధులు ముగించుకుని లేదా నైట్ డ్యూటీ విశ్రాంతిలో భాగంగా ఆసుపత్రి ఆవరణలోని తనకు కేటాయించిన రూమ్‌లోకి ఆమె వెళ్లింది.
దూర ప్రాంతం నుంచి వచ్చి ఉద్యోగం చేస్తున్నందున ఆసుపత్రి ప్రాంగణంలోని గదిలోనే ఆమె ఒక్కతే ఉంటోంది. శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఆమె బయటకు రాకపోవడం, ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది కిటికీ నుంచి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు, శంషాబాద్ డీసీపీ రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. నర్స్ ముఖం, కాళ్లపై తీవ్ర గాయాలు ఉండటంతో హత్యగా నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా ఆసుపత్రి సమీపంలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న బీహార్‌వాసి సనా ఉల్లా (35) ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
విచారణలో భాగంగా సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక సమాచారంతో పోలీసులు నిందితుడు ఎండీ సనావుల్లాను గుర్తించారు. బీహార్‌కు చెందిన సనావుల్లా తుక్కుగూడలోని బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. నిందితుడు అశ్లీల వీడియోలు చూస్తూ, మద్యం సేవించే అలవాటు కలిగి ఉన్నాడు. సంఘటనకు కొంతకాలం ముందు యువతిని వెనుక వైపు కిటికీ నుంచి గమనించి ఆమెపై లైంగిక ఆసక్తి పెంచుకున్నట్లు తెలిపారు.
ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి సమయంలో కిటికీ ద్వారా యువతి గదిలోకి ప్రవేశించి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. యువతి ప్రతిఘటించడంతో ఆమె నోరు మూసి, గొంతు పట్టుకుని దాడి చేసినట్లు తెలిపారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు అందిన 30 గంటల్లోనే సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పహాడీషరీఫ్ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
