అవును నేను అనాథనే ..
అందరు ఉండి..
ఎవ్వరు లేని ఒంటరి పక్షిని
నిజమే.. ఇది సత్యమే
నేను అనాధనే..
ఎవ్వరు అవునన్నా, కాదన్న
బంధాలు ఎన్ని వున్నా అదియాదృచ్చికమే!
మౌనం రాజ్యమేలుతున్న తరుణంలో
మాట కరువవుతున్న సమయంలో
గుండె నిండా బాధ మంటల్లో మండుతున్నది
మనస్సు ఎక్కడెక్కడో వెతుకుతున్నది
మమత ఎక్కడన్నా దొరుకుతుందేమోనని..
ప్రేమ కోసం విలవిలలాడుతూ..
హృదయం ఎడారిలోని ఎండమావుల
ఆశల పల్లకిలోఊరేగుతున్నది!
ఎన్నో కోరికలు.. మరెన్నో ఆశయాలు
గాలిలో దీపంలా ఊగిసాలాడుతున్నవి
మరి జన్మం సార్థకత వృధాగా నీరుకారిపోయి..
నిరాశ, నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నది..
మరి ఎప్పుడు.. ఈ జీవితంలో
మనసుకి ఉపశమనం?
మరి ఎన్నడూ ఈ వయస్సులో
ఓదార్పు రిచ్చే క్షణాలు!
అంతా డబ్బు చుట్టూ తిరిగే బంధాలు,
బంధుత్వాలు,స్నేహం, ప్రేమ, మమతానురాగాలు..
ఇక దరిచేరే రోజులు వస్తాయనే ఆశ నిరాశే కదా!
అందుకే..
ఎవ్వరు లేని అనాధ కన్న
అందరు వున్నా ఈ అనాధ
ఎప్పటికి దురదృష్టవంతుడే
ఇది ముమ్మాటికీ నిజం.!!
ఒంటరిగా.. ఒంటరినై
మిగిలిన బతుకు కోసం..
ఉన్నా బాధ్యతల కర్తవ్యం
గుర్తెరిగి..
ముందుకు సాగక తప్పదు గదా.!
లేకుంటే నరకమే మిగిలిన జీవితం
నాలాంటి నలుగురుని కలుపుకొని
వృద్ధులను అనాథ ఆశ్రమాలకి
పంపుతున్న ఈ ఆధునిక సమాజంపై
తిరుగు బాటు జెండా ఎగురవేయాలి..
ఈరోజు మా బతుకులకు కారణం మీరేనని
రేపటి మీ బతుకు కూడా
ఇంతకన్నా దారుణంగా ఉంటుందని
మరిచి పోరాదని హెచ్చరిక చేసి
రాజ్యం మాకు అండగా నిలబడే వరకు
ఈనాటి తరంలో మార్పు వచ్చే వరకు
అనాథ అనే మాట వినబడనంత
దూరం వరకు
విచ్ఛిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థకి
జీవం పోసే వరకు
ఈ అనాధలు పోరుబాటలో
సమిధలయి శంఖం పూరిస్తారు
తస్మాత్ జాగ్రత్త.!?
- కొండ రవీందర్
