హైదరాబాద్, వెలుగు: కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ చేపట్టింది. గాంధీ భవన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘మోదీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ, పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రధానికి దేశ ప్రజల సంక్షేమం కంటే ట్రంప్, అమెరికా ప్రయోజనాలే ప్రాధాన్యతగా మారాయని విమర్శించారు. కేంద్రప్రభుత్వ చేతగానితనాన్ని, వైఫల్యాలను దేశ ప్రజలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
