కేసీఆర్ రిజైన్ చేయాల్సిందే: ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రిజైన్ చేయాల్సిందే: ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ మహా ధర్నా

ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉంటూ అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. 2026 సెప్టెంబర్ 06వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన నిరసన సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు,సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు. 

ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తించనప్పుడు.. ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని ఈ సందర్భంగా నేతలు అన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్.. ఇందులో భాగంగా ఇందరా పార్కు వద్ద పెద్ద ఎత్తున మహాధర్నా చేపట్టింది. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు.. ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. మరో పదేళ్లు బీఆర్ఎస్ కు అధికారం రాదన్నారు. గత ప్రభుత్వంలో పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. కానీ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తున్నట్లు చెప్పారు.