పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటా: ఎస్ ఎస్ సుఖు

పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటా: ఎస్ ఎస్ సుఖు

హిమాచల్ ప్రదేశ్ సీఎం అభ్యర్థి రేసులోతానేప్పుడూ లేనని సుఖ్విందర్ సింగ్ సుఖు అన్నారు. ఫ్యూచర్ లో కూడా ఉండనని ఆయన స్పష్టం చేశారు. తను కేవలం కాంగ్రెస్ కార్యకర్తనని తెలిపారు. కార్యకర్తగానే పని చేశానన్నారు. ఎప్పుడూ ఎలాంటి పోస్టు కోరుకోలేదని తెలిపారు. తనను కాంగ్రెస్ అడగకుండానే పార్టీ చీఫ్ గా చేసిందన్నారు. పార్టీ తనకు చాలా ఇచ్చినట్లు ఎస్ ఎస్ సుఖు తెలిపారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు.

కాగా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి సీఎం క్యాండిడేట్ ను ఎంపిక చేయడం తలనొప్పిగా మారింది. సీఎం పదవీకి తీవ్ర పోటీ నెలకొనడంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే ఆ రాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే దానిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఇప్పటికే ఆమోదించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారన్న దానిపై ఆదివారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

మరోవైపు సీఎం రేసులో ప్రతిభా సింగ్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ గా, ఎంపీగా ఆమె కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించిన ఆమె.. అసెంబ్లీకి మాత్రం పోటీ చేయలేదు. కానీ సీఎం పదవిని తాను ఆశిస్తున్నట్లు, రాష్ట్రాన్ని నడిపించగలని ప్రకటించారు. దీంతో ప్రతిభాకే సీఎం పదవి ఇవ్వాలని ఆమె మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ ఎస్ సుఖు సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం జరగడంతో ఆయన తాజాగా స్పందించారు.