రుణమాఫీ అమలు ఏమైంది?: భట్టి

రుణమాఫీ అమలు ఏమైంది?: భట్టి
  • అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారు
  • అన్ని పత్రికలకు సమానంగా యాడ్స్​ ఇవ్వాలి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ అమలు ఏమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రుణమాఫీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి  బహిరంగ సభల్లో, అసెంబ్లీలో, పేపర్లలో ప్రకటనల ద్వారా ప్రచారం చేసిందని తెలిపారు. ‘‘ప్రభుత్వం చేసేది తక్కువ ప్రచారం ఎక్కువ. మీ సొంత పత్రికకు కాకుండా ఏడీఆర్ ప్రకారం అన్ని పేపర్లకు సమానంగా యాడ్స్ ఇవ్వాలి” అని డిమాండ్​ చేశారు.

ఆదివారం అసెంబ్లీలో ద్రవ్య వినిమమ బిల్లు చర్చలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తిరుమలగిరి మండలం కొంపల్లికి చెందిన రైతు మల్లేష్  రూ.73వేలు  గోల్డ్ లోన్ తీసుకుంటే ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదన్నారు. అధికారులు చుట్టూ తిరుగుతూ అప్లికేషన్లు ఇచ్చారని, సీఎం కేసీఆర్ కు రిజిస్ట్రర్ పోస్టు ద్వారా పంపించాడని తెలిపారు. ఆ అప్పు రూ.లక్షా 47వేలకు చేరిందని పేర్కొన్నారు. రూ.10వేల కోట్లతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్ ) ఎందుకు చూపించారో అనుమానంగా ఉందన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఉందని, కనీసం రూ. 18వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 8 నుంచి 10ఏండ్లు పనిచేసిన హోంగార్డులను విధుల్లో నుంచి తొలగించారని తెలిపారు. ఓయూ పీహెచ్ డీ స్కాలర్స్​కు ఫెలోషిప్ రావటం లేదని, మెస్ చార్జీలు రావటం లేదన్నారు.

ఇంతలో బాల్క సుమన్ జోక్యం చేసుకోగా.. బాల్క సుమన్​ ఎస్సీ వెల్ఫేర్ మంత్రి కావాలని కోరుకుంటున్నట్లు భట్టి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి ఏటా భారీగా అప్పులు తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేసే అప్పులు, వడ్డీల వల్ల భవిష్యత్ తరాలకు బంగారు తెలంగాణ కాకుండా సంపూర్ణ అప్పుల తెలంగాణను అందిస్తామని, ఇది చాలా ప్రమాదకరమన్నారు.

జవాబులివ్వకుండా ఉపన్యాసాలేంది?

‘‘మేం అడిగిన వాటికి జవాబులివ్వకుండా రాజకీ య అంశాల గురించే కేసీఆర్ మాట్లాడారు. బహిరంగ సభలో మాదిరి రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు” అని భట్టి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో అన్నారు. ప్రభుత్వ అప్పులకు వడ్డీ, వాయిదాల కింద ఏటా రూ.23,840 కోట్లను కట్టాల్సి ఉంటుందని, ఐదేండ్లలో వడ్డీలకే రూ.50 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం వితండవాదం చేశారని విమర్శించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు చుక్క కాళేశ్వరం నీరు వెళ్లలేదని, ప్రభుత్వమేమో పైనుంచి వచ్చిన నీళ్లతో ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా మిడ్​మానేరు, లోయర్ మానేరు, కాకతీయ కాలువను నింపి కాళేశ్వరం నీరని ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. 26,481 మందికి డిపార్ట్​మెంటల్ ప్రమోషన్లు ఇచ్చి కొత్త ఉద్యోగాలని ప్రభుత్వం చెబుతోందని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు అన్నారు. వాస్తవాలను పక్కనబెట్టి కేసీఆర్​ను, పథకాలను పొగిడేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోటీపడ్డారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.