- నేడు రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ తో మహేశ్ గౌడ్ భేటీ
- పాల్గొననున్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)కు ఎలక్షన్కమిషన్ఆఫ్ ఇండియా (ఈసీఐ) షెడ్యూల్ ప్రకటించడంతో పీసీసీ అలర్ట్ అయింది. బెంగాల్ లో సర్ పేరుతో లక్షలాది సెక్యులర్ ఓట్లను అక్రమంగా తొలగించారని అక్కడి సీఎం హోదాలో మమతా బెనర్జీ ఆరోపించిన నేపథ్యంలో.. మన రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పీసీసీ ముందుచూపుతో వ్యవహరిస్తున్నది. తెలంగాణలో కూడా సర్ పేరుతో సెక్యులర్ ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఇప్పటికే పలు సందర్భాల్లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు.
ఎవరి ఓట్లను వారే కాపాడుకోవాలని కూడా ఆయన పార్టీ సమావేశాల్లో, మీడియా ముఖంగా పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా సర్ ప్రక్రియ వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారులతో కాంగ్రెస్ నేతల భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో సెక్యులర్ భావాలు ఉన్న ఒక్క ఓటును కూడా సర్ పేరుతో ఎన్నికల అధికారులు తొలగించకుండా చూడడమే తమ బాధ్యత అని, ఎన్నికల అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తాము ఎన్నికల అధికారులను కోరనున్నట్టు పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.
