కరీంనగర్ సిటీ, వెలుగు: పెంచిన ఎల్‌పీజీ గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సోమవారం కరీంనగర్‌లోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఖాళీ సిలిండర్లు, వంటావార్పుతో నిరసన తెలిపారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో రోడ్డుపై కట్టెల పొయ్యి మీద వంట వార్పు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ.. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి దేశ ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు.
5 రాష్ట్రాల ఎన్నికల పూర్తయ్యేదాకా ఎదురుచూసి, ఎన్నికలయ్యాక ఇంధన ధరలు పెంచారని మండిపడ్డారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, నాయకులు అంజనీ ప్రసాద్, మల్లికార్జున రాజేందర్, ఆంజనేయులు గౌడ్, పద్మాకర్ రెడ్డి, ఆకుల నరసయ్య, మోహన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
