వంట చేయడం అందరికీ రాదు... అదొక కళ

వంట చేయడం అందరికీ రాదు... అదొక కళ

వంట చేయడం అందరికీ రాదు. అదొక కళ. ఆ కళను చిన్నప్పటి నుంచే ఒంట పట్టించుకున్నాడు వరుణ్ సహానీ. అందుకే సీఏకు ప్రిపేర్ అయినా.. తనకు ఇష్టమైన వంటింటిని వదల్లేక చెఫ్‌‌గా మారాడు. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్  రెస్టారెంట్‌‌లోని చెఫ్‌‌లకు చీఫ్ అయ్యాడు.హైదరాబాద్‌‌లో పుట్టి పెరిగిన వరుణ్ సహానీకి చిన్నప్పటి నుంచి వంటలపై ఆసక్తి ఎక్కువ. వరుణ్‌‌ వాళ్ల నాన్న హైదరాబాద్‌‌లోని వివిధ క్యాటరింగ్‌‌ సంస్థల్లో పని చేసేవాడు. వరుణ్ క్యాటరింగ్‌‌లో నాన్నకు, ఇంట్లో అమ్మకు సాయం చేసేవాడు. స్కూల్ చదువు పూర్తయ్యాక ఇంట్లో వాళ్ల ఇష్టం మేరకు సీఏ చేద్దామనుకున్నాడు. కానీ తన మనసులో చెఫ్ అవ్వాలని ఉండేది. అందుకే ఇంట్లో నచ్చజెప్పి హైదరాబాద్‌‌లోని ‘కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా’లో చేరాడు. అక్కడ డిగ్రీ పూర్తి చేసి, హైదరాబాద్‌‌లోని ‘ట్రైడెంట్ హోటల్’లో చెఫ్‌‌గా కెరీర్ మొదలుపెట్టాడు.

అరుదైన అవకాశం

వరుణ్‌‌కు న్యూయార్క్‌‌లోని ‘కలినరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా’లో చదవాలని ఉండేది. కానీ ఆ కోరిక తీరలేదు. అయితే  ఫ్రెంచ్, ఇటాలియన్ వంటకాల్లో ఎక్స్‌‌పర్ట్ అయిన వరుణ్ టాలెంట్‌‌ను చూసి, అమెరికాలోనే  టాప్ ఫ్రెంచ్ రెస్టారెంట్స్‌‌లో ఒకటైన‘జీన్‌‌ జార్జెస్‌‌ రెస్టారెంట్’ ఇంటర్న్‌‌షిప్ ఆఫర్ ఇచ్చింది. అలా వరుణ్  జీన్‌‌ జార్జెస్‌‌ రెస్టారెంట్‌‌లో చెఫ్‌‌గా మారాడు. అమెరికాలోని టాప్ ఫ్రెంచ్‌‌ రెస్టారెంట్లలో జీన్ జార్జెస్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌‌-100 రెస్టారెంట్స్‌‌లో ఇది కూడా ఒకటి.  ఇక్కడ కొన్ని వందల మంది ప్రొఫెషనల్ చెఫ్స్ పనిచేస్తుంటారు.  ఈ హోటల్‌‌ ఏటా నిర్వహించే ‘రిలైస్‌‌ అండ్‌‌ చాటేక్స్‌‌’ ఈవెంట్ అమెరికాలోనే పాపులర్ ఫుడ్ ఫెస్టివల్. ఈ ఈవెంట్‌‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ చెఫ్‌‌లు వస్తారు. అలాంటి ఈవెంట్‌‌ను దగ్గరుండి లీడ్ చేసే అవకాశం వరుణ్‌‌ సహానీకి వచ్చింది. నోరూరించే కొత్త రుచులతో పాటు కొత్త ఎక్స్‌‌పరిమెంట్స్ చేసేందుకు ఇదొక మంచి అవకాశం. అందుకే సర్వ్ చేసే ప్లేట్స్ నుంచి మెనూ వరకు అన్నీ వెరైటీగా ఉండేలా చూశాడు వరుణ్. ‘కానాపేస్‌‌’ పేరుతో ఒక కొత్త వంటకాన్ని ఇంట్రడ్యూస్ చేసి, వరల్డ్ ఫేమస్ చెఫ్‌‌లతో వహ్వా అనిపించు కున్నాడు మన హైదరాబాదీ చెఫ్. అయితే ఈ సక్సెస్‌‌కు కారణం ఇంట్లో అమ్మా నాన్నల దగ్గర నేర్చుకున్న పాఠాలే అంటున్నాడు వరుణ్.

తెలంగాణలో తిరిగి...

“నేను చెఫ్ అవ్వడానికి మా అమ్మే ఇన్‌‌స్పిరేషన్.  మసాలాలు నూరడం నుంచి వంట చేయడం వరకూ అన్ని అమ్మే దగ్గరుండి చూసుకోవడం, ఎంతో ఓపికతో వంట చేసి పెట్టడం నన్ను ఆకట్టుకుంది. వంట చేయడం ఒక గొప్ప పనిగా నాకు అనిపించింది. అందుకే చెఫ్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అలాగే నాన్న క్యాటరింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు సాయం చేస్తుండే వాడ్ని. అప్పుడే నాకు వడ్డించడంలో ఉన్న మాధుర్యం తెలిసింది. చెఫ్‌‌ అంటే వంట చేయడం మాత్రమే కాదు, ప్రేమగా వడ్డించడం కూడా తెలిసుండాలన్న విషయం అర్థమైంది. ఆ తర్వాత కలినరీ ఆర్ట్స్ చదివేటప్పుడు పాకశాస్త్రం గురించి మరిన్ని విషయాలు నేర్చుకున్నా. తెలంగాణలోని గ్రామాలు తిరిగి, వాళ్లు వాడే మసాలాలు, వంట చేసే విధానాలు తెలుసుకున్నా. ఫ్రెంచ్, ఇటాలియన్ వంటల్లో తెలంగాణ ఫ్లేవర్స్ కలిపి ప్రయోగాలు చేసేవాడ్ని. అలా చేసిన వంటకాలు చాలా ఫెస్టివల్స్‌‌లో సక్సెస్ అయ్యాయి. నేను చేసిన ప్రయోగాల వల్లనే నాకు గుర్తింపు వచ్చింది. ‘రిలైస్‌‌ అండ్‌‌ చాటేక్స్‌‌’ ఈవెంట్‌‌లో హోస్ట్  చేసే అవకాశం దక్కింది. ఆ ఈవెంట్ ఇన్విటేషన్ కోసం చాలామంది చెఫ్‌‌లు ఎదురుచూస్తుంటారు. అలాంటిది నాకు హోస్ట్ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఫ్యూచర్‌‌‌‌లో ఇండియాలోనే సొంతంగా రెస్టారెంట్ పెట్టాలని ఉంది. ఇటాలియన్, ఫ్రెంచ్ వంటకాలకు ఇండియన్ టచ్ ఇస్తూ కొత్త మెనూని డిజైన్ చేసే ఆలోచన ఉంది. అలాగే ప్లాంట్ బేస్డ్ మీట్‌‌లో  కొత్త ఎక్స్‌‌పరిమెంట్స్ చేస్తూ సరికొత్త వెజిటేరియన్ వంటలను తయారుచేయడమే నా ప్లాన్.”

-  వరుణ్ సహానీ

::: తిలక్​