రూ.1.57 లక్షల కోట్లకు వంటనూనె దిగుమతులు

రూ.1.57 లక్షల కోట్లకు  వంటనూనె దిగుమతులు

న్యూఢిల్లీ: మనదేశ వంటనూనెల దిగుమతుల విలువ 34.18 శాతం పెరిగి ఈ ఏడాది అక్టోబరు నాటికి రూ.1.57 లక్షల కోట్లకు చేరింది. అక్టోబరుతో ముగిసిన ఆయిల్​ ఇయర్​లో 140.3 లక్షల టన్నుల వంటనూనెను విదేశాల నుంచి కొన్నామని సాల్వెంట్​ ఎక్స్​ట్రాక్టర్స్​ అసోసియేషన్​ ఆఫ్ ఇండియా (ఎస్​ఈఏ) తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెను దిగుమతి చేసుకొనే ఇండియా, 2020–21 ఆయిల్​సంవత్సరంలో (నవంబరు‌‌–అక్టోబరు) రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంటనూనెను కొన్నది.

ఈ ఏడాది మొదటి రెండు క్వార్టర్లలో దిగుమతులు పెరగగా, మూడో క్వార్టర్లో తగ్గాయి. పామాయిల్​ అమ్మకంపై ఇండోనేషియా నిషేధం తొలగించడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో నాలుగో క్వార్టర్లో మనదేశం భారీగా వంటనూనెను కొంది. ఈ ఏడాది పామాయిల్​ ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల కారణంగా ఇండియా దీని​ కొనుగోలుపై ప్రభావం కనిపించిందని ఎస్​ఈఏ పేర్కొంది.

ముఖ్యంగా ఈ ఏడాది మార్చి–ఏప్రిల్​ మధ్య పామాయిల్​ ధరలు మిగతా నూనెల ధరల స్థాయికి చేరాయి. ఇండోనేషియా నిషేధం విధించాక లభ్యత చాలా తగ్గింది. అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే 2021–22లో పామాయిల్​ కొనుగోళ్లు రూ.83.21 లక్షల టన్నుల నుంచి 79.15 లక్షల టన్నులకు పడిపోయాయి. ఇతర నూనెల ఎగుమతులు మాత్రం 48.12 లక్షల టన్నుల నుంచి 61.15 లక్షల టన్నులకు పెరిగాయి.