10 లక్షల మార్క్‌ దాటిన కేసులు

10 లక్షల మార్క్‌ దాటిన కేసులు
  • ఒక్కరోజులో 690 మంది మృతి
  •  36,247 కేసులు
  • వచ్చే నెలలోనే మరో మిలియన్‌ కేసులు
  • ఎక్స్‌పర్ట్స్‌‌ అంచనా

న్యూఢిల్లీ: ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కంటికి కనిపించని కరోనా మహమ్మారి మన దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 10 లక్షల మార్క్‌ దాటింది. 24 గంటల్లో 36,247 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,004,652కి చేరింది. ఒక్క రోజులో 690 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 25,594కి చేరింది. ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదవ్వడం ఇదే. 10లక్షల కేసుల్లో 3,43,268 యాక్టివ్‌ కేసులు కాగా.. 6,35,790 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. అమెరికాలో 3,648,250 కేసులు ఉండగా.. 1,40,518 మంది చనిపోయారు. బ్రెజిల్‌లో 19,78,236 కేసులు ఉండగా.. 75,697 మంది వ్యాధితో చనిపోయారు.

నెలలో 10లక్షలు నమోదయ్యే అవకాశం

కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఇప్పుడు మరింత జాగ్రత్త అవసరం అని ఎక్స్‌పర్ట్స్‌ అన్నారు. మొదటి 2,50,000 కేసులు నమోదయ్యేందుకు 137 రోజులు పట్టిందని, అలాంటి మరో 2,50,000 కేసులు నమోదయ్యేందుకు కేవలం 8 రోజులు పట్టిందని ఎక్స్‌పర్ట్స్‌ చెప్పారు. డబలింగ్‌ రేట్‌ 20.6రోజులుగా నిలిచిందని అన్నారు. ఇప్పుడు ఇంక రూరల్‌ ఏరియాల్లో ఫోకస్‌ పెట్టాలని, హెల్త్‌ కేర్‌‌ మెకానిజమ్‌ వృద్ధి చేయాలని సూచించారు. కేవలం నెలలోనే మరో 10లక్షల కేసులు దాటే అవకాశం లేకపోలేదని అంచనా వేశారు.

రాష్ట్రాల్లోనూ విపరీతంగా నమోదవుతున్న కేసులు

మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజు 8,641 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. వాటిలో ఒక్క ముంబైలోనే 1476 మందికి పాజిటివ్‌ వచ్చింది. 266 మంది చనిపోయారు. తమిళనాడులో కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 1,56,369 కేసులు నమోదయ్యాయి. 2,236 మంది చనిపోయారు. కర్నాటకలో 51,442 కేసులు ఉన్నాయి. దాంట్లో బెంగళూరులోనే దాదాపు 25వేల కేసులు ఉన్నాయి. దీంతో బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్‌ విధించారు. మరోవైపు వెస్ట్‌బెంగాల్‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌, బీహార్‌‌ తదితర రాష్ట్రాల్లో కూడా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కఠిన చర్యలు చేపట్టారు. కేసులు ఎక్కువగా ప్రదేశాల్లో లాక్‌డౌన్‌ విధించారు.