కడు పేదరికంలోకి 6 కోట్ల మంది !

కడు పేదరికంలోకి 6 కోట్ల మంది !
  • కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉందన్న వరల్డ్ బ్యాంక్

వాషింగ్టన్ : కరోనా ఎఫెక్ట్ పేదవాళ్లపై తీవ్రంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల మంది కడు పేదరికంలోకి నెట్టివేయబడుతారని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్ పాస్ హెచ్చరించారు. ఇప్పటికే పేదరికంలో ఉన్న చాలామంది మరింత ఇబ్బందుల పాలవటం తప్పదని చెప్పారు. కనీస అవసరాలు కాదు తినటానికి తిండి కూడా కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నమోదైన అభివృద్ధి అంతా కరోనా కారణంగా మాయం అయ్యిందన్నారు. నిరుపేద దేశాలకు కూడా కరోనా ప్రభావం తప్పదని హెచ్చరించారు. ఈ ఏడాది వరల్డ్ ఎనకామీ 5 శాతం మేర నష్టపోనుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ పరిస్థితి నుంచి పేద దేశాలు బయట పడాలంటే సంపన్న దేశాలు ఉదారంగా వ్యవహారించాల్సి అవసరముందని సూచించింది. తమ వంతుగా ఇప్పటి వరకు దాదాపు 5.5 బిలియన్ డాలర్లు పలు దేశాలకు ఆర్థిక సహాయం అందజేశామని ఐతే ఒక్క వరల్డ్ బ్యాంక్ మాత్రమే సహాయం చేస్తే సరిపోదని మాల్ పాస్ చెప్పారు. రానున్న 15 నెలల్లో 160 బిలియన్ డాలర్లను పేద దేశాలకు ఆర్థిక సహాయంగా అందిస్తామన్నారు. ” కరోనా ఎఫెక్ట్ తో రానున్న రోజుల్లో 6 కోట్ల మంది తీవ్ర పేదరికంలో నెట్టివేయబడతారు. మూడేళ్లుగా పేదరిక నిర్మూలనకు చేసిన కృషి అంతా వృథానే ” అని మాల్ పాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద దేశాలు కోలుకునేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలని కోరారు. ఏడాది పాటు అప్పులపై మారటోరియం విధించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు.