గల్లీల బాట పడ్తున్న కార్పొరేట్ దవాఖానాలు

గల్లీల బాట పడ్తున్న కార్పొరేట్ దవాఖానాలు
  • 23 ప్రాంతాల్లో ప్రారంభించిన అపోలో.. 
  • 36 చోట్ల ఏర్పాటు చేసిన యశోద
  • రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచ్‌‌ల విస్తరణ.. డాక్టర్లతో టైఅప్‌‌, ఫ్రాంచైజీలు
  • జనాదరణ ఉన్న ఇతర దవాఖాన్ల కొనుగోలు.. పాత పేర్లతోనే వాటి కొనసాగింపు

హైదరాబాద్, వెలుగు: పెద్ద పెద్ద దవాఖాన్లు నడిపే అపోలో, యశోద వంటి కార్పొరేట్ సంస్థలు జిల్లాలు, గల్లీల బాట పడ్తున్నాయి. బిజినెస్ విస్తరణలో భాగంగా మెయిన్ సెంటర్లు చూసుకుని ఒకరిద్దరు డాక్టర్లతో నడిచే క్లినిక్‌‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అపోలో యాజమాన్యం హైదరాబాద్‌‌లోని పలు ప్రాంతాల్లో 23 క్లినిక్‌‌లను ఏర్పాటు చేసింది. షుగర్ క్లినిక్స్ పేరిట మరికొన్ని నడిపిస్తున్నది. యశోద హాస్పిటల్స్‌‌ యాజమాన్యం హైదరాబాద్‌‌లో 6 క్లినిక్‌‌లను ఏర్పాటు చేసింది. అవుట్ రీచ్ క్లినిక్స్ పేరిట ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు సుమారు మరో 30 క్లినిక్‌‌లను ఈ సంస్థ నడుపుతున్నది. అపోలో, యశోదతో పోటీని తట్టుకునేందుకు కిమ్స్‌‌, మెడికవర్, కేర్ వంటి సంస్థలు కూడా క్లినిక్​లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అంతే కాదు.. కార్పొరేట్​ సంస్థలు హైదరాబాద్‌‌లో, జిల్లాల్లో ఇతర హాస్పిటళ్ల డాక్టర్లతో టైఅప్ పెట్టుకుంటున్నాయి. తమ బ్రాండ్​ను వాడుకునేందుకు ఫ్రాంచైజీలు ఇస్తున్నాయి. వీళ్ల ద్వారా పేషెంట్లను పట్నంలోని తమ పెద్ద బ్రాంచీలకు రిఫర్ చేయించుకుంటున్నాయి. కొన్ని సంస్థలైతే మరో అడుగు ముందుకేసి జనాదరణ ఉన్న హాస్పిటళ్లను నయానో, భయానో కొనుగోలు చేసి, పాత పేర్లతోనే వాటిని కొనసాగిస్తున్నాయి. ఇవిగాక జిల్లాల హెడ్ క్వార్టర్లలో, ప్రధాన నగరాల్లో తమ బ్రాంచ్‌‌లను నెలకొల్పుతున్నాయి. హైదరాబాద్‌‌ నలుమూలలా బ్రాంచ్‌‌లను ఏర్పాటు చేస్తన్నాయి. ఈ పరిణామం మంచిది కాదని, ఇలా కొంత మంది చేతుల్లోకి హెల్త్ కేర్ ఇండస్ట్రీ వెళ్లడం ప్రమాదకరమని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఛార్జీలు పెరుగుతయ్​

ప్రజలకు అందుబాటులో క్లినిక్‌‌లు పెట్టడం మంచిదే అయినప్పటికీ, హెల్త్ కేర్​ ఇండస్ట్రీ మీద గుత్తాధిపత్యం కోసం వీటిని వాడుకోవడం ప్రమాదకరమని డాక్టర్లు అంటున్నారు. హాస్పిటళ్లలోకి దేశీ, విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఇలాంటి పెట్టుబడిదారులకు లాభాపేక్ష తప్పితే, సర్వీస్ ఒరియెంటెడ్ ఏ కోశానా ఉండదని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. తమ బ్రాండ్​ను కార్పొరేట్ సంస్థలు విపరీతంగా మార్కెటింగ్ చేసుకుంటూ తమ హాస్పిటళ్ల వైపు జనం చూపు తిప్పుకుంటున్నాయి. ఇలా మెల్లి, మెల్లిగా హెల్త్​ ఇండస్ర్టీని తమ ఆధిపత్యంలోకి తీసుకొని, డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు, బెడ్ చార్జీలు, డయాగ్నస్టిక్ చార్జీలు భారీగా పెంచే ప్రమాదం ఉందని వైద్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్​సంస్థల జోలికి హెల్త్ డిపార్ట్‌‌మెంట్ వెళ్లడం లేదు. చిన్న చిన్న హాస్పిటళ్లను తప్పితే, పెద్ద వాటిల్లో జరిగే దోపిడీని ఏమాత్రం నియంత్రించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయా సంస్థల్లో నాయకుల పెట్టుబడులు ఉండడం, వారికి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతో కార్పొరేట్ల జోలికి వెళ్లే సాహసమే ఆఫీసర్లు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేట్ చార్జీలు భరించే స్థోమత లేని వాళ్లు చిన్న హాస్పిటళ్లకు వెళ్తుంటారు. అయితే.. ఈ చిన్న హాస్పిటళ్లను కూడా కార్పొరేట్​సంస్థలు కొనుగోలు చేస్తుండడం ఆందోళన కలిగించే అంశమని డాక్టర్లు చెప్తున్నారు. దీనివల్ల జనాలకు ఆల్టర్నేట్ సర్వీస్‌‌ కనిపించక, గుత్తాధిపత్యానికి బలి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

అత్తెసరు జీతాలు!

హెల్త్ ఇండస్ట్రీ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లడం తమ భవిష్యత్‌‌కు కూడా మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. కార్పొరేట్ శక్తుల వద్ద తాము జీతగాళ్లుగా మారిపోవాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ హాస్పిటళ్లు డాక్టర్లకు నెలకు ఇంత మొత్తం రాబట్టాలని టార్గెట్లు పెట్టి పనిచేయించుకుంటున్నాయి. ఇండస్ట్రీ మొత్తం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తే ఈ టార్గెట్ల సంస్కృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఎంబీబీఎస్ డాక్టర్లు  కార్పొరేట్లు ఇచ్చే అత్తెసరు జీతాలకు పనిచేస్తున్నారు.

గుత్తాధిపత్యంతో నష్టమే

ఇండస్ట్రీ ఏదైనా గుత్తాధిపత్యంతో ప్రజలకు నష్టమే తప్పితే, లాభం ఉండదు. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఇది మరింత ప్రమాదకరం. అలాంటి పరిస్థితి రాకూడదంటే డాక్టర్లకు ప్రభుత్వం అండగా ఉండాలి. క్లినిక్‌‌లు, నర్సింగ్ హోమ్‌‌లు పెట్టుకునేందుకు సింగిల్‌‌ విండోలో పర్మిషన్లు పొందేలా నిబంధనలను సరళీకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో పాలీ క్లినిక్‌‌లు పెట్టుకునేందుకు వడ్డీ లేకుండా లోన్లు, విద్యుత్ సబ్సిడీ వంటివి ఇచ్చి డాక్టర్లను ప్రోత్సహించాలి. ఇవన్నీ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తాయి.. హెల్త్ కేర్ కాస్ట్‌‌ను తగ్గిస్తాయి. - డాక్టర్ సంపత్‌‌రావు, ప్రెసిడెంట్, ఐఎంఏ తెలంగాణ

ప్రజలకు భారం

ప్రభుత్వాలు అనవసరమైన రూల్స్ పెట్టి చిన్న చిన్న హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్స్ మూసుకునేలా చేస్తున్నాయి. ఇది ఆటోమేటిక్‌‌గా కార్పొరేట్లకే హెల్ప్‌‌ అవుద్ది. కార్పొరేటు యాజమాన్యాలు చెప్పినట్టు వినే జీతగాళ్లుగా డాక్టర్లు మారిపోతారు. ఉద్యోగాలు కాపాడుకునేందుకు, కార్పొరేట్లు పెట్టే టార్గెట్లకు తగ్గట్టుగా డాక్టర్లు పనిచేయాల్సి వస్తుంది. హెల్త్​ కేర్​ ఇండస్ట్రీ కొద్ది మంది చేతుల్లో ఉండడం వల్ల, వాళ్లు చెప్పినట్టుగా చార్జీలు ఇష్టారీతిన పెరుగుతాయి. ఇది ప్రజలకు భారం అవుతుంది. ఇలా జరగకూడదంటే సొంతగా క్లినిక్‌‌లు, నర్సింగ్‌‌ హోమ్‌‌లు పెట్టుకునే డాక్టర్లను ప్రోత్సహించాలి. చిన్న హాస్పిటళ్లను బతకనివ్వాలి. అనవసరమైన, కఠిన నిబంధనలను ఎత్తేసి, పేషెంట్ సేఫ్టీకి అవసరమైన రూల్స్‌‌ను మాత్రమే అమలు చేయాలి. సబ్ సెంటర్‌‌‌‌ నుంచి టీచింగ్ హాస్పిటళ్ల వరకూ ప్రభుత్వ వైద్య సంస్థలను బలోపేతం చేయాలి. - డా. మహేశ్‌‌, ప్రెసిడెంట్‌‌, హెల్త్ రిఫార్మ్స్‌‌ డాక్టర్స్ అసోసియేషన్