
పాట్నా: బీహార్‌లోని సరన్ లోక్‌సభ స్థానంలోఈ సారి ఆసక్తికర పోరు జరగనున్నది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఇప్పటికే ఆ సెగ్మెంట్లో నామినేషన్దాఖలు చేయగా.. లాలూ ప్రసాద్‌యాదవ్ పేరుగల సరన్ జిల్లాకు చెందిన స్థానిక రైతు కూడా నామినేషన్‌వేశారు. ఏప్రిల్ 26న ఆయన రాష్ట్రీయ జనసంభవ పార్టీ (ఆర్జేపీ) అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. లాలూ ప్రసాద్‌యాదవ్ ప్రతి ఎలక్షన్లోనూ పోటీ చేస్తారు. ఆయన 2017, 2022లో రాష్ట్రపతి ఎన్నికకు కూడా నామినేషన్‌వేశారు. అయితే, 2017 అధ్యక్ష ఎన్నికల్లో తగిన సంఖ్యలో ప్రతిపాదకులు లేకపోవడంతో అతని నామినేషన్ రిజెక్ట్ అయింది.
ఈ సందర్భంగా లాలూ ప్రసాద్యాదవ్మీడియాతో మాట్లాడుతూ.. "నేను గత చాలా కాలంగా సరన్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవిపై కూడా పోటీ చేశాను. ఈసారి ఆమె కుమార్తె రోహిణి ఆచార్యపై పోటీ చేస్తున్నాను. నేను వ్యవసాయంతో పాటు సామాజిక సేవ చేస్తున్నాను. పంచాయతీ నుంచి దేశ అధ్యక్ష ఎన్నికల వరకు నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి అవకాశాన్నీ వదిలిపెట్టను. సరన్ ప్రజలు నా వెంట ఉన్నారు" అని యాదవ్ చెప్పారు. కాగా, యాదవ్ వద్ద రూ.5 లక్షలు, అతని భార్య వద్ద రూ.2 లక్షల నగదు ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. ఆయన పేరిట రూ.17.60 లక్షలు, ఆయన భార్య పేరిట రూ.5.20 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు.